బీహార్ ఎన్నిక‌ల్లో కీల‌క మ‌లుపు.. అనుకున్న‌దే అయ్యిందా..

బీహార్ ఎన్నిక‌ల్లో కీల‌క మ‌లుపు వ‌చ్చి ప‌డింది. నితిష్ కుమార్ బీజేపీతో క‌లిసి పోటీ చేస్తే తాము పోటీ చేయ‌బోమ‌ని తెగేసి చెప్పింది ఎల్జేపీ. అయితే ఆ త‌ర్వాత ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నామ‌ని అయితే బీజేపీతో మాత్రం స్నేహ‌బంధం కొన‌సాగిస్తామ‌ని చెప్పింది. అయితే నేడు బీజేపీ నేత‌లు దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ మాట్లాడుతూ చిరాగ్ చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీతో ఎలాంటి పొత్తులూ లేవని ప్రకటించారు. ఎల్జేపీతో మాకు ఎలాంటి పొత్తులూ లేవని ధ్రువీకరిస్తున్నామ‌న్నారు. గందరగోళం రాజకీయాలను వ్యాప్తి చేయడం మాకు అవ‌స‌రం లేద‌ని.. ఎల్జేపీని ‘వోటు స్ప్లిట్’ పార్టీగా జవదేకర్ అభివర్ణించారు. బీజేపీ ఎవరికీ బీ టీమ్‌గా ఉండదని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమే తిరిగి అధికారంలోకి వస్తుందని జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు.

అయితే బీజేపీ వ్యాఖ్య‌ల అనంత‌రం వెంట‌నే చిరాగ్ పాశ్వాన్ మాట్లాడారు. చిరాగ్ పాశ్వాన్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాము ఓటును చీల్చేవారిమే అయితే 2014 లో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్ర‌శ్నించారు. సీఎం నితీశ్ ఒత్తిడితోనే బీజేపీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని, బీజేపీ తమ వివేకాన్ని జోడించి వ్యాఖ్యానించాలని చిరాగ్ చురకలంటించారు. తమ తండ్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు నరేంద్ర మోదీ చాలా గౌరవం ఇచ్చేవారని, తాను మోదీతోనే ఉంటానని, ఆయనను చాలా గౌరవిస్తానని ప్రకటించారు. 143 స్థానాల్లో పోటీచేస్తామని, అంతే కాకుండా జేడీయూకు వ్యతిరేకంగా కూడా అభ్యర్థిని దించుతామని ఆయన ప్రకటించారు. కొందరు నితీశ్‌ ఒత్తిడితో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చేది ఎల్జేపీ, బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఈ తాజా ప్ర‌క‌ట‌న‌ల‌తో బీహార్‌లో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here