ఎన్నిక‌ల్లో ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన గులాంన‌బీ ఆజాద్‌..

దేశంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభ‌వం ఎదురైన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల‌పై భారీ అంచ‌నాలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఫ‌లితాల‌ను చూసి షాక్ అవ్వాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత పార్టీలోకి కీల‌క నేత‌లు కాంగ్రెస్ అధిష్టానాన్ని నిందించారు.

అయితే మ‌రో సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాత్ కాంగ్రెస్ ఓట‌ముల‌పై మాట్లాడారు. ఎన్నిక‌ల్లో పార్టీ ఎందుకు ఓడిపోవాల్సి వ‌చ్చిందో క్లారిటీ ఇచ్చారు. ఈ త‌రుణంలో అధిష్టానానికి ఆయ‌న అండ‌గా నిల‌బ‌డ్డారు. బీహార్ ఎన్నికలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి పార్టీని తీవ్రంగా కలవరపెడుతోందన్నారు. ఇందుకు కార‌ణం పార్టీ అధిష్ఠానం మాత్రం కాదన్నారు. లీడర్‌షిప్ అద్భుతంగా ఉందని తెలిపారు. పార్టీని ప్రేమించి, పార్టీ కోసం శ్రమించేవారు కరువవ్వడం వల్లే పార్టీ బలహీనపడిందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దీనికి తోడు పోటీలో నిలబడే నేతలకు, కింది స్థాయి నాయకులకు మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా మా ఓటమికి కారణమని చెప్పారు.

ముఖ్యంగా పార్టీ తరపున ఎన్నికల టికెట్ పొందిన నేతలు ప్రజల్లో ఉండడం లేదన్నారు. టికెట్ పొందిన వెంటనే 5 స్టార్ హోటల్ బుక్ చేసుకుంటున్నారని, అక్కడే కూర్చుంటున్నారని, అలా అయితే గెలుపెలా సాధిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మళ్లీ గాడిలో పడాలంటే నేతలు 5స్టార్ కల్చర్ వదిలేయాలని, ప్రజలతో మమేకం అవ్వాలని, వారికి అండగా ఉన్నామన్న నమ్మకం కలిగించాలని, వారి అవస్థలను తీరుస్తామన్న భరోసా ఇవ్వాలని సూచించారు. తమ నేతల్లో అదే కరువైందని, అందుకే పార్టీ వరుసగా ఓటములను చవిచూస్తోందని అజాద్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here