జ‌గ‌న్ స‌ర్కార్‌తో యుద్ధం ఎవ‌రికి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి రాజ‌కీయ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌ప్పుడు ఏ స్థానిక సంస్థ‌లు ఈ వివాదానికి కార‌ణం అయ్యాయో అవే ఎన్నిక‌లు మ‌రోసారి తీవ్ర వివాదం రాజేయ‌నున్నాయా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌స్తుతం చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తుంటే ఆందోళ‌న క‌లుగుతోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అప్ప‌ట్లో ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపిన విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు. ఆ త‌ర్వాత క‌రోనా కోర‌లు చాచ‌డం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం క‌రోనా నేప‌థ్యంలో ఇప్పుడే ఎన్నిక‌లు వ‌ద్ద‌ని చెబుతోంది. అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నారా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

నేడు రాజ‌కీయ పార్టీల‌తో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్నితో కూడా స‌మావేశం జ‌రిగింది. ఈ అన్ని స‌మావేశాల స‌మాచారంతో ఆయ‌న ప‌క్కాగా వెళుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే ప్ర‌భుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంది. ఎన్నిక‌లు మాత్రం ఇప్పుడు నిర్వ‌హించే అవకాశం లేద‌ని భావిస్తోంది. అయితే ఇదే విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌రుకు మ‌ళ్లీ వివాదం అవుతుందా అన్న ఆందోళ‌న క‌లుగుతోంది. ఇప్ప‌టికే ఇరువురి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి.

ఏపీలో ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న మేధావులు, రాజ‌కీయ విశ్లేష‌కులు మ‌ళ్లీ ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న సంకేతాలు ఇస్తున్నారు. అయితే ప్ర‌భుత్వం సుముఖ‌త వ్య‌క్తం చేయ‌క‌పోతే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో బీహార్ ఎన్నిక‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతూ ఏపీలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఒత్తిడి కూడా ఉంటుంది. అప్పుడు ఎన్నిక‌ల‌ను వాయిదా వేసిన స‌మ‌యంలోనే ఎన్నిక‌ల క‌మీష‌న‌రుకు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏమాత్రం సరిపోలేదు. అప్ప‌ట్లో ఇది పెద్ద వివాద‌మైన విష‌యం అంద‌రికీ తెలుసు. ఇప్పుడు అదే సీన్ మ‌ళ్లీ రిపీట్ అవుతుందా అన్న‌ది వేచి చూడాలి. ఏదిఏమైనా ఏం జ‌రిగినా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు జ‌రిగితే చాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here