కేంద్ర ప్ర‌భుత్వం ఏం చెప్పినా రైతులు విన‌డం లేదు..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర ప్ర‌భుత్వం, రైతుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే కేంద్రం ఏ ప్ర‌తిపాద‌న తెచ్చినా రైతులు మాత్రం విన‌డం లేదు. ఫ‌లితంగా చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

వివాదస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన ప్రతిపాదనను రైతులు ఏకగ్రీవంగా తిరస్కరించారు. అంతే కాకుండా డిసెంబర్ 14న దేశ వ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. రైతు ఉత్పత్తుల సేకరణకు ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం కొనసాగుతుందని, ఈ మేరకు లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ ప్రతిపాదనలో కేంద్రం పేర్కొంది. అయితే వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం మినహా మరే ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు.

సెప్టెంబర్‌లో ఆమోదించిన కొత్త వ్యవసాయ చట్టాలు సంబంధించి రైతుల ఆందోళనలపై అవసరమైన అన్ని వివరణలను వారికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కేంద్రం తెలిపింది. అయితే, చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాల ప్రధాన డిమాండ్‌ను మాత్రం ఈ ప్రతిపాదనలో ప్రభుత్వం ప్రస్తావించలేదు. కొత్త చట్టాలతో మండీలు బలహీనమవుతాయన్న రైతుల ఆందోళనను ప్రస్తావిస్తూ, మండీలకు వెలుపల కార్యకలాపాలు సాగిస్తున్న ట్రేడర్ల రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేలా సవరణలు తేవచ్చని పేర్కొంది. పన్నులు, సెస్ విధించవచ్చని తెలిపింది.

రైతుల ఆందోళనలను ఎలాంటి అరమరికలు లేకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. రైతుల పట్ల ఎంతో గౌరవభావంతో ఉన్న‌ట్లు పేర్కొంది. రైతు సంఘాలు తమ ఆందోళనను విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందని రైతులకు లిఖిత పూర్వకంగా పంపిన ప్రతిపాదనలో కేంద్రం పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here