రాజ‌కీయ నాయ‌కుల ఘ‌ర్ష‌ణ‌లో తండ్రీ కొడుకు మృతి..

రాజ‌కీయ పార్టీల గొడ‌వ‌లు స‌హజం. ప‌లు ప్రాంతాల్లో ఇలాంటివి వెలుగు చూస్తూనే ఉంటాయి. అయితే ఇక్క‌డ జ‌రిగిన ఘ‌ర్ష‌ణ మాత్రం దేశం మొత్తం షాక్ అయ్యేలా ఉంది. రెండు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌ల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు చ‌నిపోయారు.

రాజస్తాన్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ-కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. ఫతేపూర్ పట్టణ సమీపంలోని బలోద్ బడి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫతేపూర్ పంచాయతి సమితీలోని 19 వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి రుబీనా ఖాన్ గెలిచినట్లు ప్రకటించారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి రుబీనా ఖాన్‌ను కొట్టడం ప్రారంభించారు. అతడికి మద్దతుగా మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. ఆ వెంటనే బీజేపీ కార్యకర్తలు ప్రతిదాడి ప్రారంభించారు. ఇరు వర్గాలు కర్రలతో తీవ్రంగా కొట్టుకున్నాయి.

ఈ ఘర్షణలో కన్హయిలాల్ (35), అతడి తండ్రి ప్యారేలాల్ (57) ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు మరో పది మంది గాయపడ్డారు. కన్హయిలాల్, అతడి తండ్రి ప్యారేలాల్‌లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే కన్హయిలాల్ మరణించాడు. చికిత్స పొందుతూ ప్యారేలాల్ మరణించారు. ఈ ఘర్షణతో సంబంధం ఉందని భావిస్తున్న 22 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు సిఖర్ పరిధి ఎస్పీ గగన్‌దీప్ సింగ్లా అన్నారు. కాగా తండ్రి కొడుకు మృతిచెంద‌డంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here