డ్రైవ‌ర్లు, ఆఫీస్ బాయ్‌ల‌ను కంపెనీల‌కు డైరెక్ట‌ర్లుగా పెట్టేశారు..

అవినీతి చేసేందుకు ఎలాంటి దారులైనా వెతుక్కుంటార‌ని మ‌నం వింటూ ఉంటాం. అయితే ఇక్క‌డ మాత్రం ఏకంగా డ్రైవ‌ర్లను, ఆఫీస్ బాయ్‌ల‌నే కంపెనీల‌కు డైరెక్ట‌ర్లుగా పెట్టేశారు. ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ చందా కొచ్చార్ నిందితురాలిగా ఉన్న ఈ కేసులో.. ఆమె భర్త దీపక్ కొచ్చార్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్ ఏ విధంగా డమ్మీ డైరెక్టర్లను నియమించుకున్నారో ఈడీ బయటపెట్టింది. డ్రైవర్లు, తోటపని వాళ్లు, ఆఫీస్‌ బోయ్‌లు మొదలు ఇతర జూనియర్ సిబ్బందిని ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా చూపించినట్టు ఈడీ తేల్చింది.

ఓ ఆంగ్ల ప‌త్రిక ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఉద్యోగులందరి నుంచి ఈడీ రికార్డు చేసిన వాంగ్మూలాల్లో మరిన్ని బిత్తరపోయే విషయాలు బయటపడ్డాయి. తాము ఏ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నామో కూడా తెలియదంటూ కొందరు సిబ్బంది వెల్లడించారు. అలా ఈడీ వెల్లడించిన కొన్ని పేర్లలో కేశార్మాల్ నేన్షుఖ్‌లాల్ గాంధీ ఒకరు. 1994 నుంచి అహ్మద్ నగర్‌లోని దూత్ బంగ్లాలో క్లీనర్‌గా పనిచేస్తున్న ఆయన.. ఇండియన్ రిఫ్రిజిరేటర్ కంపెనీ లిమిటెడ్‌ (ఐఆర్‌సీఎల్) డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

వీడియోకాన్ ఇంటర్నేషనల్ సంస్థలో తోటమాలిగా పనిచేస్తున్న లక్ష్మీకాంత్ సుధాకర్ కటోరే కూడా ఈడీ ముందు తెల్లముఖం వేశాడు. పలు కంపెనీల్లో డైరెక్టర్ పదవితో పాటు రియల్ క్లీన్‌టెక్ ప్రయివేట్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్)లో 50 శాతం షేర్‌హోల్డింగ్ ఉన్నట్టు అతడికి ఇసుమంత కూడా తెలియదు. ఇప్పటికీ అతడి జీతం కేవలం రూ.10 వేలుగానే ఉంది. మరోవైపు దీపక్ కొచ్చార్ సైతం తన బిజినెస్‌తో ఏమాత్రం సంబంధం లేనివారిని కంపెనీల్లో డైరెక్టర్లుగా నియమించుకున్నట్టు తేలింది. దీపక్ కొచ్చార్ కంపెనీలో ఆఫీస్‌ బోయ్‌గా ఉంటూ.. ఆయన తండ్రికి సేవలు చేస్తూ, డ్రైవర్‌గా ఉండే వ్యక్తికి పీసీఎస్పీఎల్ కంపెనీలో డైరెక్టర్‌గా పేర్కొన్నారు. అతడికి తెలియకుండానే పలు పత్రాలు, అగ్రిమెంట్లపై సంతకాలు కూడా పెట్టించుకున్నట్టు ఈడీ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here