చెన్నైలో ఈ సారి అంద‌రూ ఇంట్లో ఉండాల్సిందే..

న్యూ ఇయ‌ర్ వ‌చ్చిందంటే చాలు రెండు రోజుల ముందు నుంచే సంబ‌రాలు మొద‌ల‌వుతాయి. ప్ర‌ధానంగా హైద‌రాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైల్లో ఈ హ‌డావిడి మామూలుగా ఉండ‌దు. అయితే ఈ సారి మాత్రం ఆ సీన్ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వేడుకల‌కు నో చెబుతున్నారు.

చెన్నై మెరీనా బీచ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడూ ప‌ర్యాట‌కుల‌తో మెరీనా సంద‌డి వాతావ‌ర‌ణంలాగా ఉంటుంది. న్యూ ఇయ‌ర్‌కి ఇక్క‌డ స్పెషల్ ఎట్రాక్ష‌న్ ఉంటుంది. అయితే ఈ సారి అక్క‌డ వేడుక‌లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి పళనిస్వామి ప్రకటించారు. డుకల్లో భాగంగా డిసెంబరు 31వ తేది రాత్రి 10 గంటల నుంచే వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మెరీనా తీరంలో యువత పెద్ద సంఖ్యలో గుమిగూడి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటారు. వేడుకల అనంతరం వారు బైక్‌లపై రోడ్లలో తిరుగుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా అన్ని రకాల వేడుకలను నిషేధించిన ప్రభుత్వం, అనంతరం లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపులు ఇచ్చి తక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొని వేడుకలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఈ నేపథ్యంలో, విదేశాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఈ రోజున బీచ్‌లు, రోడ్లు, క్లబ్‌లు, రిసార్ట్‌లు, హోటళ్లు తదితరాల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని, ఈనెల 31, జనవరి 1 తేదీల్లో బీచ్‌లోకి సందర్శకులను అనుమతించమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here