టైం పాస్ చేయ‌కండి.. కేంద్ర ప్ర‌భుత్వానికి చెప్పేసిన రైతులు..

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌త 4 వారాలుగా ఢిల్లీ స‌రిహ‌ద్దులో రైతులు నిర‌వ‌ధిక నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే కేంద్ర ప్రభుత్వం రైతుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతూ ఉంది. కానీ రైతులు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు.

కేంద్రం చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు తీసుకొస్తామ‌ని చెబుతూ ఉంది. అయితే రైతులు మాత్రం చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని అంటున్నారు. ఢిల్లీ చుట్టు పక్కల లక్షలాది మంది రైతులు వివాదస్పద వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తామని చెప్పినప్పటికీ మూడు చట్టాల్ని పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చట్టాల‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రైతులకు కేంద్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. అయితే ఆ లేఖలను ‘టైంపాస్ లెటర్లు’ అని రైతులు అభిప్రాయపడ్డారు.

తమతో చర్చలు చేయకుండా ఈ లేఖల కాలక్షేపం ఏంటని మండిపడ్డారు. కేంద్రం రాసిన లేఖల్లో జరిగిన చర్చల గురించి మినహా ఇంకేమీ లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాము డిమాండ్ చేస్తున్న అంశాలను ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం రైతులు అడుగుతున్న చ‌ట్టాల డిమాండ్ విష‌యంలో ఏం చేస్తుంద‌న్న దానిపై ఉత్కంఠ‌త నెల‌కొంది. మ‌రోవైపు రైతుల‌కు దేశ వ్యాప్తంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు రైతుల‌కు అనుకూలంగానే మాట్లాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here