ఏపీలో ప‌రిస్థితుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ ర‌మేష్ కుమార్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న వేళ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఆయ‌న వ్యాఖ్య‌లు మ‌రింత హీట్‌ను పెంచే అవ‌కాశం ఉంది. నేడు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్లో నిజం లేద‌న్నారు.
కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌తో చర్చలు జరిపినట్లు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు. సీఎస్ నీలం సాహ్ని అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సీఈసీ అనుసరిస్తున్న విధానాలనే రాజకీయపక్షాల గుర్తింపు, సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా అమలు చేసినట్లు వివరించారు. ఇక రాజ‌కీయ పార్టీల‌ను ఒక్కొక్క‌రికిగా పిలిచి ఎందుకు మాట్లాడార‌న్న ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.

కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటించినట్లు చెప్పుకొచ్చారు. సామాజిక దూరం, జాగ్రత్తలను అనుసరించడానికి, సమయ స్లాట్‌లతో వ్యక్తిగత సంప్రదింపులు ఉత్తమమైందిగా భావించినట్లు చెప్పారు. సురక్షితమైన అంశంగా భావించి ఈ విధానాన్ని అమలు చేసినట్లు స్పష్టంచేశారు. ఎవ్వ‌రినీ సంప్ర‌దించ‌కుండా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఏంటన్న వైసీపీ ప్ర‌శ్న‌ల‌కు నిమ్మ‌గడ్డ ఇచ్చిన స‌మాధానాలు కౌంట‌ర్‌గానే ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సిద్దంగా లేదు. రాజ‌కీయ పార్టీల స‌మావేశానికి అభిప్రాయాలు తెలిపేందుకు 11 పార్టీలు హాజరైనట్లు తెలిపారు. రెండు పక్షాలు మాత్రం లిఖితపూర్వక సమాధానాలు పంపినట్లు పేర్కొన్నారు. సమావేశానికి ఆరు రాజకీయ పక్షాలు హాజరుకాలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here