ఇది రాతి యుగం పాలనా? రాక్షసుల దీవెనా!!

అసలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనం తిరోగమనంలో వెనక్కు వెళ్తున్నామా లేక అధఃపాతాళం వైపు కిందకు పరుగులు పెడుతున్నామా అర్థం కావడం లేదు. గుడ్డిగా నమ్మి అధికారాన్ని అప్పజెప్పిన ప్రజానీకం ఇంకా రెండేళ్ళు భరించాలా అని తలుచుకుని భయంతో వణికిపోతున్నారు. అడ్డుఅదుపు లేకుండా రాష్ట్రంలో పెరుగుతున్న దౌర్జన్యపర్వానికి అడ్డుకట్ట వేసే వారు లేక జనం మరో మార్గం లేక బాధను పంటి కిందే బిగిపెట్టి భరిస్తూ ఉన్నారు. వాస్తవంగా చూసుకుంటే మన రాష్ట్రంలో నిజంగా అంతటి దారుణమైన పరిస్థితులు తాండవిస్తున్నాయా అనే ప్రశ్న రేగడం సహజం. దానికి మరికొంత లోతుగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కొన్ని పర్యాయాలు ఒక కుటుంబానికి విధేయులుగా ఉన్న ఒక రాష్ట్ర ప్రజలు నాయకత్వ మార్పు కోసం బిజెపి కి పట్టం కట్టినప్పుడు ఒక సన్యాసిని ఆ పీఠంపై కూర్చోబెట్టింది అధినాయకత్వం. అప్పుడు చెలరేగిన విమర్శలు అన్ని ఇన్ని కావు. తనకంటూ సంసారం లేని వాడు అంత పెద్ద రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడు అని స్వపక్ష సభ్యులే అధిత్యనాథ్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. కాని అతను బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి అమలుపరుస్తున్న పధకాలు కాని ప్రక్షాళన కాని చూస్తున్న వారు నోరు మెదపడానికి కూడా సాహసించడం లేదు. ఇప్పుడే కాదు మరో రెండు పర్యాయాలు ఆయనే ఉండాలి అని మైనారిటీ వర్గాలు కూడా మనస్పూర్తిగా కోరుకుంటున్నాయి. మరి సిఎంగా ఏ మాత్రం అనుభవం లేని ఒక హిందుత్వ వాది ఎలా ప్రజాదరణ పొందాడు అనేది చరిత్ర తన పేజీల్లో భద్రపరుచుకుంటుంది. ఇక్కడ మా ఉద్దేశం బిజెపి ఘనత అని చెప్పడం కాదు. ఆదిత్యనాథ్ కు తన ప్రజల పట్ల అచంచలమైన బాధ్యత నిర్వర్తించడంలో ఆయన సాధించిన విజయం గురించి మాత్రమే. అందుకే ఆయన ఒకే ఒక్కడు అయ్యాడు.
ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తెవాల్సి వచ్చింది అనే మీ అనుమానానికి ఇక్కడ వివరణ ఉంది. రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవశాలి నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తారు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి. రోజుకో దారుణం. అక్రమం. ఇదేమిటి అని ప్రశ్నిస్తే నిష్కారణంగా వేధింపులకు గురి చేయటం. ఈ రోజు అధికార ఎంపి తనయుడు పక్క రాష్ట్రంలో తను రుసుము చెల్లించమని అడిగినందుకు మొత్తం అక్కడి వ్యవస్థని నాశనం చేసి పారేసాడు. దీనికి ఆయన పిలిచి మందలించి వదిలేసారు అని ఓ పచ్చ పత్రిక పొగుడుతూ మరీ హెడ్ లైన్. ఎక్కడికి పోతున్నాం మనం. ఏర్పేడు ఘటనలో పదిహేను ప్రాణాలు గాలిలో కలిసిపోతే దానికి బాధ్యులైన వారిని ఇంత దాకా అరెస్ట్ చేయకపోవడమే కాక వాళ్ళ ఫోటోలను ప్రచురించే దమ్ము ధైర్యం కూడా చేయలేకపోయాయి ఆ పచ్చ పత్రికలు. పైగా ప్రతిపక్ష నాయకుడి హోదా జగన్ పర్యటించినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ అనుచరులు తొందరపాటు తనంతో జిందాబాద్ కొడితే దాన్ని కూడా జగన్ కే ఆపాదించిన గొప్ప సంస్కారం ఎవరిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇసుక మాఫియా గురించి కథలు కథలుగా అక్కడి ప్రజలు చెబుతున్నా అన్ని అధికార యంత్రాంగం కనుసన్నల్లో జరిగినా ఇంత వరకు కనీస చర్యలు చేపట్టకపోవడానికి కారణం సదరు బాధ్యులు అధికార పార్టీ కి చెందిన వాళ్ళే కావడం. ఈ రోజు సస్పెండ్ చేసారు. మరి ఇన్నేళ్ళుగా ఆ దందా కొనసాగిస్తున్న వాళ్ళ పై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కబెట్టిన వాళ్ళను కనీసం ఈ మూడేళ్ళలో ఒక్కసారైనా మందలించారా. అంటే ప్రభుత్వం లో అక్రమానికి సంబంధించి ఏదైనా కదలిక రావాలి అంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోవాలనే సందేశాన్ని ఇస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. ఒక బుక్ కు సరిపడా ఉదాహరణలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కేవలం రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన కారణంగా ఇంటూరి రవికిరణ్ ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ట్రీట్ చేసిన మన పోలీసు యంత్రాంగం గతంలో ఓ మహిళా తహసిల్దార్ పై జుట్టు పట్టుకుని మరీ ఓ ప్రజా ప్రతినిధి దాడికి తెగబడితే కనీసం ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ వారంట్ తో ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయింది. ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి ఓ ప్రజా ప్రతినిధి బజారు బాషలో ఇక్కడ రాయలేని దారుణమైన పదజాలంతో దూషించినప్పుడు కనీసం ఇది తప్పు అనే ఖండించే గుణం కూడా ఒక్కరిలో కనిపించలేదు. అన్నింటిలోను స్పందన ఒకటే. ప్రెస్ ఇలాంటి వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు క్రమశిక్షణ నా ఊపిరి ఎవరిని వదిలిపెట్టం అని కల్లబొల్లి మాటలు చెప్పడమే తప్ప ఇంతవరకు దేనిపైనా సీరియస్ గా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మహిళా భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేంత ఘోరంగా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయి. నడిరోడ్డు మీద ఓ మంత్రివర్యులు గారి పుత్రరత్నం ఓ అమ్మాయిని వేధించడం వీడియో కెమెరాలో రికార్డు అయితే అందులో నుంచి అతన్ని బయట పడేయడానికి మహా దిగ్గజాలు రంగంలోకి దిగటం ఎవరు మర్చిపోలేదు.
జనం మన నుంచి ఏమి కోరుతున్నారో పట్టించుకోకుండా రాజధాని పేరుతో ఓ రంగుల ప్రపంచాన్ని చీటికి మాటికి కళ్ళ ముందు చూపిస్తూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తున్న ఈ ప్రభుత్వ తీరు పట్ల రైతు మొదలు కొని వ్యాపారి వరకు ఎంతటి అసంతృప్తితో ఉన్నారో తెలియాలంటే ముందస్తుగా వచ్చే అవకాశాలు ఉన్న ఎన్నికల వరకు వేచి ఉండక తప్పదు. వారసత్వం కూడదు అని ఒకప్పడు నీతులు చెప్పిన వారే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో కుదరదు కాబట్టి దొడ్డి దారిలో తనయులను మంత్రులుగా మార్చుకున్న కుతంత్రాన్ని ఎవరు మర్చిపోలేదు. విభజన తర్వాత చిక్కి శల్యం ఐన ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేయకుండా మందిమాగధులకు సేవ చేయడంలోనే తరిస్తున్న సర్కార్ నిద్ర నుంచి మేల్కొనకపోతే సమయం రావదానికంటే ముందే రాజకీయ సమాధి తప్పదు. అది ఎంతో దూరంలో లేదు కూడా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here