పొలిటిక‌ల్ ఎంట్రీపై బ్రాహ్మ‌ణి క్లారిటీ

కొద్దికాలంగా మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌య నారా బ్రాహ్మ‌ణి పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చింది. తాజాగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో త‌న రాజ‌కీయ అరంగేట్రంపై బ్రాహ్మ‌ణి స్వ‌యంగా వివరాలు వెల్ల‌డించారు. త‌మ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ పై పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తానని స్ప‌ష్టం చేశారు. రాజకీయాల్లో ప్రవేశించే ఆలోచన తనకు లేదని ఆమె తేల్చిచెప్పారు.
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రారంభించి పాతికేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన నారా బ్రహ్మణి మీడియా స‌మావేశం ఏర్పాటు ఈ సంద‌ర్భంగా సంస్థ గురించి వివ‌రించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ తాను రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని త‌మ కంపెనీ వ్య‌వ‌హారాల‌నే చూసుకుంటాన‌ని తెలిపారు. త‌న మామ‌య్య సీఎం చంద్ర‌బాబు, తండ్రి బాల‌కృష్ణ‌, త‌న జీవిత భాగ‌స్వామి నారా లోకేష్ ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉన్నార‌ని బ్రాహ్మ‌ణి వివ‌రించారు.
హెరిటేజ్ రజతోత్సవం పూర్తి చేసుకోవ‌డం సంతోషక‌ర‌మ‌ని పేర్కొంటూ వచ్చే ఐదేళ్లల్లో 6వేల కోట్ల రూపాయల రెవెన్యూ లక్ష్యంతో భవిష్యత్తు ప్రణాళికలు చేస్తున్నట్లు బ్రాహ్మ‌ణి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో విలువ ఆధారిత ఉత్ప‌త్తులను 22 శాతం నుంచి 40శాతానికి పెంచనున్నట్లు బ్రహ్మణి చెప్పారు. ప్రస్తుతం పదిహేను రాష్ట్రాల్లో రోజూ 14 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు వివరించారు. ముంబై, పుణె వంటి పశ్చిమ మార్కెట్ తో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వ్యాపారం నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల రిలయన్స్ రిటైల్ డెయిరీ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నందున దేశవ్యాప్తంగా మరింత విస్తరించనున్నట్లు బ్రహ్మణి తెలిపారు. కార్యక్రమంలో హెరిటేజ్ ఎండీ నారా భువనేశ్వరి సైతం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here