బ్రెజిల్‌, మెక్సికోలో ప‌రిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా..

ప్ర‌పంచాన్ని క‌రోనా ఇంకా వ‌ణికిస్తూనే ఉంది. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. బ్రెజిల్ దేశంలో కరోనా వైరస్ తో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే 823 మంది కరోనాతో మరణించారు. బ్రెజిల్ దేశంలో కరోనా మొత్తం మరణాల సంఖ్య 1,85,650 కి చేరిందని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

బ్రెజిల్ దేశంలో తాజాగా జరిపిన పరీక్షల్లో 52,544 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,62,978కి చేరుకున్నాయి. బ్రెజిల్ దేశంలో డిసెంబరు 30వ తేదీ వరకు బ్రెజిలీయన్లు, విదేశీయులు వచ్చినా వారికి విమానాశ్రయాల్లో కొవిడ్ పరీక్షలు చేయాలని, వారికి నెగిటివ్ ఫలితాలు వస్తేనే అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బ్రెజిల్ దేశంలో కరోనా ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా తీరప్రాంతాలు, భూసరిహద్దులను మూసివేసింది.

మెక్సికో సిటీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధిస్తామని మెక్సికన్ అధికారులు చెప్పారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో శనివారం నుంచి జనవరి 10వతేదీ వరకు మెక్సికో సిటీతోపాటు రాజధానికి మూడువైపులా ఉన్న మెక్సికో రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మెక్సికన్ ఉప ఆరోగ్యశాఖ మంత్రి హ్యూగో లోపెజ్ గాటెల్ చెప్పారు. రాబోయే మూడు వారాల్లో కరోనా వ్యాప్తి, కరోనా మరణాలను తగ్గించడానికి లాక్ డౌన్ లాంటి అసాధారణ చర్యలు అవసరమని లోపెజ్ గాటెల్ చెప్పారు.

మెక్సికోలో నూతన సంవత్సర ఉత్సవాల సందర్భంగా కరోనా ప్రబలకుండా నిరోధించేందుకే మళ్లీ లాక్ డౌన్ ను విధించారు.మెక్సికో నగరంలో 2,77,733 కరోనా కేసులు నమోదు కాగా, 15,083 మంది మరణించారు. మెక్సికో దేశంలో 12,89,298మందికి కరోనా సోకగా, దీంతో 1,16,487 మంది మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here