బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసు తీర్పు చెప్పిన న్యాయ‌మూర్తి ఏం చేశారో తెలుసా..

సంచల‌నం సృష్టించిన బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పిన న్యాయ‌మూర్తి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. బాబ్రీ మ‌సీదు కూల్చ‌వేత కేసు తుది తీర్పును విశ్రాంత న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్‌.కే యాద‌వ్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న‌కు భ‌ద్ర‌త పొడ‌గించాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

సెప్టెంబ‌ర్ 30 వ తేదీన బాబ్రీ మ‌సీదు తుది తీర్పు వ‌చ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎల్‌కే అడ్వాణీ, ఎంఎం జోషి, ఉమా భారతి సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. ఈ తీర్పు అనంత‌రం న్యాయ‌మూర్తి ఎస్‌.కే యాద‌వ్ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. అయితే ఈ కేసు సున్నిత‌మైన‌ద‌ని ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త కొన‌సాగించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. అయితే దీనిపై జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌కే యాదవ్‌కు భద్రత పొడిగించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

కేవలం ఓ లేఖ ఆధారంగా భద్రత కల్పించడం సరికాదని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. కాగా అయోధ్యలోని వివాదాస్పద కట్టడం బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక కుట్ర కోణం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవంటూ సెప్టెంబర్ 30 ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులోని మొత్తం 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసు తీర్పు వెలువ‌రించిన విశ్రాంత న్యాయ‌మూర్తికి భ‌ద్ర‌త క‌ల్పిస్తార‌ని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here