ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఎంత మంది మంత్రులు కామెంట్లు చేశారో తెలుసా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హాట్ టాపిక్‌గా మారారు. మీడియా ముందు మాట్లాడుతున్న ప్ర‌తి ఒక్క‌రూ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించే మాట్లాడుతున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వానికి చెందిన మంత్రులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్రంగా మండిప‌డుతున్నారు.

మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఏమ‌న్నారంటే.. ‘రాజకీయం అంటే సినిమా సెట్టింగ్, షూటింగ్ కాదు. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయి.. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు..మా నాయకుడిలా పాదయాత్ర చేయండి. 14 నెలలు పాదయాత్ర చేయాలంటే సినిమా కాదు. ఏ పార్టీకి సపోర్టు చేస్తాడో ఆయనకే తెలియదు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక పోయారు’ అంటూ సురేష్‌ ఎద్దేవా చేశారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ పవన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మంత్రులపై పవన్ వ్యాఖ్యలు దారుణమని వ్యాఖ్యానించారు. ఎన్నో పుస్తకాలు చదివిన పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో రాజకీయ ప్రముఖుల గురించి తెలుసుకోవాలని సూచించారు. సినిమా ప్రమోషన్ కోసమే పవన్‌ ఇలా పర్యటనలు చేస్తున్నారని అవంతి మండిపడ్డారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌, లోకేష్‌తో చెప్పించుకునే స్థితిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేరని మంత్రి కౌంటరిచ్చారు.

పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవనే పెద్ద బోడి లింగమంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్‌లను ప్రజలు నమ్మరన్నారు. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు.

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూగత ప్రభుత్వం రుణమాఫీపై ఎలా స్పందించారో చెప్పాలని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. కోవిడ్ టైంలో పవన్ ఎక్కడికెళ్లారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ముట్టడిస్తామన్న పవన్ కల్యాణ్ మాటలను ఎవరూ విశ్వసించరని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో పొందుపరచని అంశాలని సైతం సీఎం జగన్ నెరవేరుస్తున్నారని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here