అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భార‌త్ గురించే చ‌ర్చ‌..

ప్ర‌పంచంలో అగ్ర‌దేశ‌మైన అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా జో బైడెన్ పోటీలో ఉన్నారు. వీరిరువురి మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగుతోంది. దీంతో ఎన్నిక‌ల్లో ప్ర‌తి చిన్న విష‌యాన్ని నేత‌లు క్యాష్ చేసుకుంటున్నారు.

ఇటీవ‌ల ప్ర‌చార చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ట్రంప్ ఇండియాపై నోరు పారేసుకున్న విష‌యం తెలిసిందే. క‌రోనా మ‌ర‌ణాల విష‌యంతో పాటు కాలుష్యంలో కూడా భారత్‌పై ట్రంప్ విమ‌ర్శ‌లు చేశారు. ఇది మ‌న‌దేశంలో తీవ్ర దుమారం రేపింది. త‌న స్నేహితుడ‌ని ప్ర‌ధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటే ట్రంప్ భార‌త్‌పైనే విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌తిప‌క్షాలు వ్యంగాస్త్రాలు సంధించాయి. అయితే ఇప్పుడు ఇదే అవ‌కాశాన్ని ట్రంప్ ప్ర‌త్య‌ర్థి క్యాష్ చేసుకుంటున్నారు. తాను అధ్య‌క్షుడిగా ఎన్నికైతే భార‌త్‌తో ఏ విధంగా ఉంటానో క్లియ‌ర్‌గా చెబుతున్నారు. భార‌తీయ అమెరిక‌న్ల‌ను ఉద్దేశించి జోబైడెన్ మాట్లాడారు.

ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్‌తో కలిసి పనిచేస్తామ‌ని డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ వ్యాఖ్యానించారు. చైనాతో పాటు ఏ దేశ‌మూ సరిహద్దు దేశాల్లో అలజడులు సృష్టించకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటా అంటున్నారు. భారతీయ అమెరికన్లతో నాకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని.. అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో ట్యూషన్ ఫీజును లక్షా 25వేల డాలర్లలోపే ఉండేలా చేస్తా అని హామీ ఇస్తున్నారు. దీని వల్ల వేలాది భారతీయ అమెరికన్ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. భారత్- అమెరికా మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ కేవలం ఫొటోలకే పరిమితమయ్యారని జో బైడెన్ విమ‌ర్శించారు. తాను అలా కాద‌ని ఆయా అంశాల్లో ఇరు దేశాలు సంతృప్తికరమైన ఫలితాన్ని పొందేలా చేస్తా అంటున్నారు. నేను కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేసినప్పుడు మీరు బాగా సంతోషించారని నాకు తెలుసని.. ఆమె కథ… మీ కథ ఒక్కటే.. .. అంటూ భారతీయ అమెరికన్లను ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తనకు మద్ధతుగా నిలిచి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here