బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన భాగమతి డైరెక్టర్..

ఆకాశ రామన్న సినిమాతో తెలుగులో దర్శకత్వం మొదలు పెట్టిన డైరెక్టర్ అశోక్.. నాని హీరోగా తెరకెక్కిన పిల్ల జమిందార్‌ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అశోక్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మారు మోగింది. ఇక అనంతరం అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన భాగమతి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన అశోక్ బాలీవుడ్ లోనూ దర్శకత్వం చేసే అవకాశాన్ని కొట్టేశాడు. ప్రస్తుతం భాగమతి చిత్రాన్ని హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలో భూమి పెడ్నేకర్ నటిస్తోంది. చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. ఇంకా ఈ సినిమా విడుదల కాకముందే అశోక్ బాలీవుడ్‌లో మరో చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా సాధారణమైనది కాదని, ఒక ప్రయోగాత్మకమైన చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమాను మూకీ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. అంటే ఈ సినిమాలో కేవలం నటన తప్ప.. మాటలు, పాటలు ఉండవు. ఈ సినిమాకు ‘ఉఫ్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మించనుందని సమాచారం. మరి ఈ చిత్రాన్ని కేవలం హిందీ లోనే విడుదల చేస్తారా లేదా ఇతర భాషలోకూ డబ్ చేస్తారా అన్నది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here