బాబ్రీ మ‌సీదు తానంత‌టే అదే కూలిపోయిందా.. కోర్టు తీర్పుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత ఘ‌ట‌న‌లో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు అంద‌రినీ నిర్దోషులుగా తేల్చుతూ సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. బీజేపీ అగ్ర‌నేత ఎల్‌.కే అద్వానీతో పాటు కేసులో ఉన్న వారంతా ఈ తీర్పు పట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఎంఐఎం పార్టీ మాత్రం దీన్ని త‌వ్రంగా ఖండించింది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అంద‌రినీ నిర్దోషులుగా తేల్చితే మ‌సీదును ఎవ‌రు కూల్చార‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ అన్నారు. అంద‌రూ నిర్దోషులైన‌ప్పుడు మ‌సీదు దానంత‌ట అదే కూలిపోయిందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగిందో.. ఎవ‌రు కూల్చారో ప్ర‌పంచం మొత్తం చూసింద‌న్నారు. ఉమాభారతి మ‌సీదును కూల్చండి అని నినాదాలు చేయ‌లేదా అన్నారు. తీర్పుపై సీబీఐ హైకోర్ట‌కుకు వెళ్లాల‌న్నారు.

కాగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మ‌సీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే.  దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. 28 సంవత్సరాల అనంతరం ఈ కేసులో తుది తీర్పు ఇవాళ వెలువడింది.

కాగా కోర్టు తీర్పు అనంత‌రం అద్వానీ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత అద్భుతమైన వార్త అందింద‌న్నారు. ఒక్కటి మాత్రమే చెప్పగలుగుతా. జైశ్రీరాం. ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైంది. మా అందరికీ సంతోషకరమైన క్షణం. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. రామ జన్మభూమి ఉద్యమం పట్ల నా వ్యక్తిగత నిబద్ధత, పార్టీ నిబద్ధతను ఈ తీర్పు నిరూపిస్తుంది. అంటూ అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here