ఫేస్‌బుక్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఢిల్లీ..

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌పై ఢిల్లీ అసెంబ్లీ శాంతి భ‌ద్ర‌త‌ల క‌మిటీ సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీ అల్ల‌ర్ల విష‌యంలో ఇదివ‌ర‌కే ఫేస్ బుక్‌కు నోటీసులు జారీ చేసిన క‌మిటీ మ‌రోసారి నోటీసులు పంపింది. ఇదే ఫైన‌ల్ అని కూడా చెప్ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈశాన్య ఢిల్లీలో సీఏఏ నిర‌స‌న‌లు జ‌రిగాయి. అల్ల‌ర్లు జ‌రిగడంతో హింసాత్మ‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఈ స‌మ‌యంలో ఫేస్ బుక్ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రైంది కాద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో విద్వేష ప్ర‌సంగాల విష‌యంలో ఫేస్‌బుక్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై విచార‌ణ‌కు రావాల‌ని ఢిల్లీ అసెంబ్లీ శాంతిభ‌ద్ర‌త‌ల క‌మిటీ ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ క‌మిటీ ఎదుట హాజ‌రుకాలేనందున మ‌రోసారి ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపారు. ఇవే చివ‌రి నోటీసుల‌ని భార‌త్‌లోని ఫేస్‌బుక్ సంస్థ ఉపాధ్య‌క్షుడు, ఎండి అజిత్ మోహ‌న్ కు సూచిస్తూ.. ఈ నెల 23లోగా ఆయ‌న క‌మిటీ ముందు హాజ‌రుకావాల‌ని చెప్పింది.

అయితే ఫేస్‌బుక్ మాత్రం ఈ అంశం కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోనికి వ‌స్తుంద‌ని అంటోంది. ఇప్ప‌టికే తాము పార్ల‌మెంటు క‌మిటీ ముందుకు హాజ‌ర‌య్యామని.. మీరు పంపిన నోటీసులు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు పేర్కొంది. వీటిని వెన‌క్కు తీసుకోవాల‌ని చెప్పింది. దీనిపై ఢిల్లీ అసెంబ్లీ శాంతిభ‌ద్ర‌త‌ల క‌మిటీ తీవ్రంగా స్పందించి మ‌రోసారి నోటీసులు పంపించింది. ఢిల్లీ అసెంబ్లీ పార్ల‌మెంటుతో సంబంధం లేకుండా స్వ‌తంత్రంగా ప‌నిచేస్తుంద‌ని తెలిపింది. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కు వెళ్తుందో తెలియాలంటే 23వ తేదీ వ‌ర‌కు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here