కరోనా కేసులు దేశంలో పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు విధించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ మేరకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
రాజస్థాన్‌లో కరోనా ప్రభావం అత్యధికంగా కలిగిన 8 జిల్లాలలో రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోతా నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్రంలో ప్రజారోగ్యం కాపాడేందుకేనని సీఎం తెలిపారు. ఆయా జిల్లాల్లో కరోనా కట్టడి చర్యల బాధ్యతను కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీసులు అధికారులు చేపట్టాలన్నారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు కర్ఫ్యూ విధించామని, పెళ్లి, వేడుకల సందర్భాల్లో వందకు మించి అధికంగా అతిథులు హాజరు కాకూడదనే నిబంధన విధించామని తెలిపారు. అలాగే సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.
ప్రస్తుత కరోనా కాలంలో జరుగుతున్న వివాహాలకు అత్యధిక సంఖ్యంలో జనం హాజరైతే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే వివాహాలు జరిగే ప్రాంతంలో పోలీసులు, ఇతర పరిపాలనా అధికారులు వీడియోగ్రఫీ చేయిస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివాహాలకు వందమందికి మించి హాజరైతే పెళ్లి నిర్వాహకులకు రూ. 25 వేల వరకూ జరిమానా విధిస్తామని తెలిపారు. ఇదే విధంగా మార్కెట్లలలో కూడా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని, మాస్క్ పెట్టుకోనివారికి రూ. 500 జరిమానా విధిస్తారని అన్నారు.