కోవిడ్ భ‌యం.. ఢిల్లీలో మ‌ళ్లీ లాక్ డౌన్‌..?

క‌రోనా కేసులు పెరుగుతున్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో మ‌రోసారి లాక్‌డౌన్ విధించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి ఓ ప్ర‌తిపాద‌న‌ను పంపిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న ఓకే అయితే క‌రోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో మ‌రోసారి లాక్‌డౌన్ పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మంగ‌ళ‌వారం ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఏమ‌న్నారంటే.. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వానికి జనరల్ ప్రపోజల్ ఒకటి పంపుతున్నామ‌ని చెప్పారు. నిబంధనలు పాటించని ప్రాంతాలు తిరిగి కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా మారే అవకాశాలున్నాయన్నారు. అందుకే పరిస్థితి అనివార్యతను బట్టి అలాంటి మార్కెట్లను కొద్ది రోజుల పాటు ఢిల్లీ ప్రభుత్వం మూసి ఉంచాలనుకుంటోందని చెప్పారు. రాజధాని నగరంలో కోవిడ్ పరిస్థితిని అదుపు చేసేందుకు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం రెట్టింపు యత్నాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తక్షణం 750 ఐసీయూ పడకలు పెంచడం ద్వారా ఢిల్లీ ప్రజలకు కేంద్రం సాయంగా నిలిచిందని సీఎం కృతజ్ఞతలు చెప్పారు.

ఇరు ప్రభుత్వాలు, ఏజెన్సీలు కోవిడ్ నియంత్రణ ప్రయత్నాలు రెట్టింపు చేసినప్పటికీ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే ఫలితం ఉండదని హెచ్చరించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం నిబంధనలను పాటించాలని సీఎం కోరారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు కూడా ‘ఆప్’ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పంపిందని, వివాహ కార్యక్రమాలకు 50 మందిని మాత్రమే అనుమతించాల్సిందిగా ఆ ప్రతిపాదనలో ఎల్జీని తాము కోరామని కేజ్రీవాల్ చెప్పారు. దీనికి ముందు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వివాహ కార్యక్రమాలకు 200 మంది వరకూ రాష్ట్ర ప్రభుత్వం అనుతించింది. కాగా, గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తుండటం ఆందోళనకర పరిణామంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here