క‌రోనా బిజినెస్ ఆగేనా..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనాని క్యాష్ చేసుకొన్న కొంద‌రి క‌క్కుర్తికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మొన్న జరిగిన స్వర్ణ ప్యాలెస్ ఘ‌ట‌న‌తో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. హాస్పిట‌ల్స్లో ప్రాణాలు కాపాడుకునేందుకు వెళితే ఉన్న ప్రాణం పోయేలా వ్య‌వహ‌రిస్తున్నారు ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు.

ర‌మేష్ హాస్పిట‌ల్ కోవిడ్  కేర్ సెంట‌ర్‌లో అగ్నిప్ర‌మాదం ఏర్ప‌డి ప‌ది మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం ఈ విష‌యంలో సీరియస్‌గా ముందుకు వెళుతోంది. ఇప్ప‌టికే క‌మిటీలు వేసి అసలు అక్క‌డ ఏం జ‌రిగిందో, జ‌రుగుతుందో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చెప్పింది. ఇక స్వ‌ర్ణ‌ప్యాలెస్ హోట‌ల్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌లో నిబంధ‌న‌ల‌కు నీళ్లు వ‌దిలిన‌ట్లు తెలుస్తోంది.

ర‌మేష్ హాస్పిట‌ల్ యాజ‌మాన్యం స్వ‌ర్ణ ప్యాలెస్‌, స్వ‌ర్ణ హైట్స్ హోట‌ళ్ల‌లో క్వారంటైన్ నిర్వ‌హించేందుకు సాదార‌ణ అనుమ‌తి తీసుకుంది. కానీ భ‌ద్ర‌త‌, ఇత‌ర మున్సిప‌ల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం తీసుకోవాల్సిన ప‌ర్మిష‌న్లు మాత్రం తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఇక వైర‌స్ తీవ్ర‌త త‌క్కువ ఉన్న ల‌క్ష‌ణాల‌తో ఉంటే రోజుకు రూ. 5వేలు మాత్ర‌మే వ‌సూలు చేయాల్సి ఉంది. కానీ ఇక్క‌డ మాత్రం రూ. 70వేలు వ‌సూలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక వెంటిలేట‌ర్ స‌పోర్టు లేకుండా కేవ‌లం ఆక్సిజ‌న్ సాయం అందించి రోజుకు రూ 80 వేలు వ‌సూలు చేసిన‌ట్లు ప‌లువురు చెబుతున్నారు.

ఇక ర‌మేష్ హాస్పిట‌ల్ సంబంధించిన కోవిడ్ కేర్ సెంట‌ర్ ఒక్క‌టే కాదు రాష్ట్రంలో క‌రోనాను సాకుగా చూపి ప్ర‌జ‌ల‌ను దోచుకునేందుకు అధికార పార్టీకి చెందిన వారు కూడా ఇదే త‌ర‌హా రూటులోనే వెళుతున్నార‌ని చ‌ర్చ న‌డుస్తోంది. విజ‌య‌వాడ‌లో ప్రైవేటు ఆసుపత్రుల యాజ‌మాన్యాలు అధికార పార్టీ నాయ‌కులు చెప్పిన‌ట్లు వింటున్న‌ట్లు స‌మాచారం. హాస్పిట‌ల్స్లో కొన్ని బెడ్ల‌ను వీరికే ఇచ్చేశార‌ని.. వీరు ఒక్కో బెడ్‌ను రూ. 50వేలకు అమ్ముకుంటున్నార‌ని చ‌ర్చ‌. అంతేకాకుండా క‌రోనా స‌మ‌యంలో ఎక్కువగా వాడే మందులు, విట‌మిన్ల ట్యాబ్లెట్లు ఇలాంటివి కూడా స‌ర‌ఫ‌రా చేస్తూ సొమ్ముచేసుకుంటున్నార‌ని అధికార పార్టీ నాయ‌కుల‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు

మ‌రి నిబంధ‌న‌ల మేర‌కు అన్ని ఆసుప‌త్రులు ప‌నిచేయాల‌ని.. ప్ర‌జ‌ల నుంచి అధిక ఫీజులు వ‌సూలు చేయ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం చెబుతూనే ఉన్నా ఇలా ఎందుకు జ‌రుగుతుందో. ఇప్ప‌టికైనా రాష్ట్రంలోని అన్ని హాస్పిట‌ల్స్‌లో నిబంధ‌న‌ల మేర‌కే వైద్యం స‌దుపాయాలు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here