బీహార్‌లో కౌంటింగ్ ప్రారంభం.. ఎన్డీయే ఇలా కామెంట్ చేసింది..

దేశం మొత్తం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న‌ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ఉదయం 8గంటలకు సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య బీహార్ రాష్ట్రంలోని 38 జిల్లాల్లోని 55 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్, బీహార్ మిలటరీ పోలీసు, జిల్లా సాయుధ పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద కూడా భారీ సాయుధ పహరా ఏర్పాటుచేశారు. బీహార్ రాష్ట్రంలో మూడు దశలుగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన 3,755 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీనటుడు శత్రుఘన్ సిన్హా కుమారుడు లవ్ సిన్హా తన ప్రత్యర్థి కంటే ఆధిక్యంలో ఉన్నారు. శత్రుఘన్ సిన్హా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించిన పార్లమెంటు పరిధిలోని బంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి లవ్ సిన్హా పోటీ చేశారు.బర్ బిగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన జేడీయూ అభ్యర్థి రణధీర్ సోని లీడింగ్ లో ఉన్నారు. రాజోపూర్ లో ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీప్రసాద్ యాదవ్. పర్సాలో జేడీయూ అభ్యర్థి చంద్రికా రాయ్ లు ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎం జితిన్ రాం మాంజీ, ఆర్జేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.

బీహార్‌‌లో ఏ ప్రభుత్వ ఏర్పడబోతున్నదీ ఈరోజు తేలిపోనుంది. బీహార్ ఓటర్ల మదిలో ఏమున్నదీ నేడు వెల్లడికానుంది. ఎగ్జిట్ పోల్స్‌లో మహాఘట్‌బంధన్‌కు విజయావకాశాలున్నాయని వెల్లడైనప్పటికీ, బీజేపీ మాత్రం బీహార్ ఓటర్లు ఎన్డీఏకే పట్టంకడతారనే నమ్మకంతో ఉంది. పార్టీ జాతీయ ప్రతినిధి షహన్వాజ్ హుస్సేన్ మాట్లాడుతూ బీహార్‌లో భారీ మెజారిటీతో ఎన్డీఏ విజయం సాధిస్తుందని, నితీష్ కుమార్ తిరిగి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్ ఓటర్లు ప్రధాని మోదీ, సీఎం నితీష్‌లపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, భారీ సంఖ్యలో ఓటర్లు ఎన్డీఏకు ఓటు వేశారని షహన్వాజ్ హుస్సేన్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here