10వేల మంది విద్యార్థుల‌కు క‌రోనా నిర్ధారణ ప‌రీక్ష‌లు.. ఎంత మందికి పాజిటివ్ వ‌చ్చిందో తెలుసా..

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇటీవ‌ల క‌ళాశాల‌ల్లో క‌రోనా అంద‌రినీ భ‌యానికి గురి చేస్తోంది. త‌మిళ‌నాడులోని క‌ళాశాల‌ల్లో క‌రోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో అధికారులు విద్యార్థులంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

మద్రాస్ ఐఐటీలో విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో చెన్నై నగరంలోని పలు కళాశాలలు, వసతిగృహాల్లోని 6,344 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. మరో 210 మంది కళాశాల విద్యార్థులకు కొవిడ్ -19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. మరో 2,361 శాంపిళ్ల పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మద్రాస్ ఐఐటీలో 191 మందికి, అన్నా విశ్వవిద్యాలయంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. మెస్ వల్లనే మద్రాస్ ఐఐటీలో కరోనా ప్రబలిందని తేలడంతో డైనింగును మూసివేసి విద్యార్థులున్న హాస్టల్ గదులకు టేక్ అవే ఫుడ్ అందించాలని ఐఐటీ అధికారులు నిర్ణయించారు.

విద్యార్థులు ఫేస్ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ ఆదేశించారు. తమిళనాడు రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే కొత్తగా 1174 కరోనా కేసులు వెలుగుచూశాయి. తమిళనాడులో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 9,829కి చేరింది. మొత్తం ఇప్పటివరకు 8.03 లక్షల మందికి కరోనా సోకగా, వారిలో 11942 మంది మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here