ఎన్టీఆర్‌ టీజర్‌పై వివాదం..

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్‌ పాత్ర కుమ్రం భీంను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్‌ టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వీక్షించిన వీడియోగా ఈ టీజర్‌ రికార్డు సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ టీజర్‌పై వివాదం రాజుకుంటోంది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ను కుమ్రం భీంగా చూపించారు. అయితే టీజర్‌ చివరిలో ఎన్టీఆర్‌ ముస్లిం టోపీని ధరించి కనిపిస్తాడు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణంగా మారింది. ‘నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా పోరాడిన కుమ్రం భీం చరిత్రను పూర్తిగా అర్థంచేసుకొని సినిమా తీయాలని’ కుమ్రంభీం యువసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరీ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే కుమ్రం భీం, అల్లూరి సీతరామరాజుల జీవితాలను ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది వరకు విడుదల చేసిన రామ్‌చరణ్‌ టీజర్‌, ఇప్పుడు విడుదల చేసిన ఎన్టీఆర్‌ టీజర్‌ను గమనిస్తే.. అల్లూరి పాత్రలో ఉన్న చెర్రీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కూడా కనిపిస్తున్నాడు.. అలాగే కుమ్రం భీం పాత్రలో కనిపించిన వ్యక్తి ఒక ముస్లిం పాత్రలో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పునరజన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందా?అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here