ఇది విన్నారా.. ఉల్లిగ‌డ్డ‌లు చోరీ చేస్తున్నారంట‌..

దేశంలో వింత ప‌రిస్థితి నెల‌కొంది. ఉల్లిగ‌డ్డ‌ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వ‌ర్షాల కార‌ణంగా పంట దిగుబ‌డులు ఆశించినంత రాలేదు. అయితే వ‌చ్చిన‌వి కూడా మొన్న‌టి దాకా త‌క్కువ రేట్లే ప‌లికాయి. కానీ ఇప్పుడు మాత్రం రేట్లు ఎక్కువ‌య్యాయి. దీంతో ప్ర‌జ‌లు కొన‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు.

ఉల్లి రేట్లు పెర‌గ‌డంతో దొంగ‌లు రెచ్చిపోతున్నారు. ప‌లు చోట్ల నిల్వ ఉంచిన ఉల్లి బ‌స్తాల‌ను ఎత్తుకెళుతున్నారు. మహారాష్ట్రలోని పూణెలో గల ఒక గోదాములో నిల్వ ఉంచిన 550 కిలోల ఉల్లి చోరీకి గురయ్యింది. ఈ ఉదంతంలో ఒక దొంగను అదుపులోనికి తీసుకోగా, మరొక దొంగ పరారయ్యాడు. ఈ ఘటన పూణె పరిధిలోని దేవజలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని రైతులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోకి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు గోదాములోని 38 బస్తాల ఉల్లిని చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు.

దీనిని గమనించిన ఒక వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా అక్కడికి చేరుకున్నారన్నారు. వారంతా కలసి ఒక దొంగను పట్టుకోగా, మరొక దొంగ అక్కడి నుంచి పారిపోయాడన్నారు. 10 బస్తాల ఉల్లి మాయమైందని తెలిపారు. కేజీ ఉల్లి వంద రూపాయ‌ల‌కు వ‌చ్చే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. కిలో రూ. 30 చొప్పున రాష్ట్రాల‌కు కేంద్రం ఉల్లిని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ముంద‌స్తుగా ఉల్లిని నిల్వ చేసి ఉంచింది. దీని నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వాలు అవ‌స‌ర‌మైన మేర‌కు ఉల్లిని తీసుకోవాల‌ని సూచించింది. ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, బీహార్‌, చండీగ‌డ్‌, హ‌రియానా రాష్ట్రాలు ఉల్లిని తీసుకుంటున్నాయి. ఉల్లి రేట్లు త‌గ్గ‌క‌పోతే మ‌రిన్ని దొంగ‌త‌నాలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here