బిహార్‌లో ఎన్నిక‌లు వ‌స్తే ఏపీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు..?

దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం చూపిస్తోంది. ప్ర‌స్తుతం 70వేల‌కు పైగా కొత్త కేసులు ప్ర‌తి రోజూ న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీహార్‌లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌రుగుతోంది. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఎన్నిక‌గా ఇది నిలిచిపోనుంది.

243 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం దేశం ఉన్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ మామూలు అంశం కాదు. అయినా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా బిహార్‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. అయితే ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్లో జ‌రిగిన ప‌రిస్థితులు అంద‌రూ అంచ‌నా వేసుకున్నారు. క‌రోనా ప్రారంభ ద‌శ‌లోనే రాష్ట్రంలో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌ను వాయిదా వేసింది ఎన్నిక‌ల సంఘం.

ఏపీలో జ‌ర‌గాల్సిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌ట్లో ఈ నిర్ణ‌యం సంచ‌ల‌న‌మే అయ్యింది. ఆ త‌ర్వాత క‌రోనా కేసులు పెర‌గ‌డం.. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతూనే ఉంది. అయితే ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఎన్నిక‌లుగా బిహార్ ఎన్నిక‌లే జ‌రుగుతుంటే.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగి ఉంటే అధికారుల పాల‌న కాకుండా ప్ర‌జా ప్ర‌తినిధులు పాలించేవారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరేవి. కానీ ప్ర‌స్తుతం పాల‌క మండ‌ళ్లు లేక చాలా గ్రామాల్లో స‌మ‌స్య‌లు తిష్ట వేశాయ‌ని చెప్పొచ్చు. అయితే బిహార్ కంటే మ‌న ఎన్నిక‌లు అంత పెద్ద‌వేమీ క‌దుక‌దా అన్న ప్ర‌శ్న‌లు సామాన్యుల నుంచి కూడా వ‌స్తున్నాయి. అయినా ఇప్పుడు జ‌రిగిన దానికి ఎవ్వ‌రూ ఏమీ చెయ్య‌లేరు. కానీ ఇది మాత్రం చ‌రిత్ర‌లో నిలిచిపోతూ ఉంటుంద‌ని మేధావులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here