ఏలూరు ప‌రిస్థితిని ప‌ట్టించుకోకుండా సీఎం జ‌గ‌న్ పెళ్లికి వెళుతున్నారా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ ఏ చిన్న అవ‌కాశం దొరికినా అధికార పార్టీపై నిప్పులు చెరుగుతోంది. తాజాగా ఏలూరులో ప్ర‌జ‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ఏలూరు నగరాన్ని అంతుపట్టని వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేయడం.. మూడు రోజుల వ్యవధిలోనే 300 మందికి పైగా ఆస్పత్రిపాలవ్వడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ వాంతులు, మూర్ఛ, నోటి వెంట నురగలు వచ్చి ఎక్కడికక్కడ పడిపోవడం చాలా తీవ్రమైన పరిణామమన్నారు.

ఇలాంటి ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యంలో సీఎం స్పందించిన తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి ఆస్పత్రికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి పైపై తిరిగితే కాదన్నారు. బాధ్యతగా అక్కడ జరిగిందన్నదానిపై ఆరా తీయాలన్నారు. ముందు పరిశుభ్రత పాటించాలన్నారు. సీఎం జగన్ చేసే పని చూస్తుంటే..ఏలూరు వచ్చి పెళ్లికి వెళుతూ.. ఆస్పత్రికి వచ్చి ఒకసారి చూసి వెళ్లిపోయారని విమర్శించారు. ఇది ఏ విధంగా బాధ్యత అనిపించుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయికి వెళితే వాస్తవాలు తెలుస్తాయని చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వ చేతగానితనం వల్లే ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అవగాహన లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. నిత్యం పారిశుద్ధ్యం నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు రావన్నారు. ఏలూరులో ఏం జరుగుతుందో ప్రభుత్వం తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీపై విమర్శలు చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేమీ తెలియదన్నారు. చేతకాని ప్రభుత్వం కారణంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here