ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను: చిరు 

ఒకప్పుడు టాలీవుడ్ లో నెం1 హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి కొన్నేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం మళ్లీ ‘ఖైదీ నెం.150′ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇక తాజాగా వరుస సినిమాలను ప్రకటిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ..’ చరణ్, నేను కలిసి నటించాలన్నది నా భార్య సురేఖ కోరిక. ఆచార్య తో అది నెరవేరుతోంది.

ఆచార్య చిత్రంలో నాకు, చరణ్‌కి కలసి నటించే అవకాశం లభించింది. మళ్లీ ఇలాంటి కథ దొరుకుతుందో లేదో అని ఆ పాత్రలో చరణ్‌ నటిస్తే బావుంటుంది అనుకున్నాం. ప్రస్తుతం చరణ్‌ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్నాడు. అందుకని ‘ఆచార్య’ కోసం రాజమౌళిని రిక్వెస్ట్‌ చేసి చరణ్‌ డేట్స్‌ అడ్జెస్ట్‌ చేశాం. ‘ఆచార్య’ వచ్చే ఏప్రిల్‌కి పూర్తవుతుంది. ఆ తర్వాత వీవీ వినాయక్‌ దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ (మలయాళం)  రీమేక్, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ (తమిళం) రీమేక్‌లో నటిస్తాను. ఈ మధ్య ట్రై చేసిన గుండు లుక్‌ ‘వేదాళం’ కోసమే. కానీ ఆ లుక్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. ఇక నుంచి ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ఎప్పటిలానే థియేటర్స్‌కు వస్తారనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు చిరు. ఏడాదికి మూడు సినిమాలు చేస్తానన్న చిరు మాటలు విన్న ఆయన అభిమానులు ఎగిరి గంతేస్తారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here