క‌రోనా వైర‌స్ భార‌త్‌లోనే పుట్టింద‌ని ఆధారాలు చూపించిన చైనా..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ చైనాలో పుట్టింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే చైనా మాత్రం ఇప్పుడు క‌రోనా వైర‌స్ భార‌త్ నుంచి వ‌చ్చింద‌ని బ‌లంగా చెబుతోంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు కూడా చూపిస్తోంది.

చైనా శాస్త్రవేత్తలు చేస్తున్న వాదన ప్రకారం.. చైనాలో బయటపడ్డది అసలు కరోనా వైరస్ కాదట. వాస్తవానికి ఈ మహమ్మారి భారత్‌లోనే పురుడు పోసుకుందట. గత ఏడాది ఎండాకాలంలో ఈ వైరస్ ఆవిర్భవించిందని వారు వాదిస్తున్నారు. ఆ తరువాత..కలుషిత నీటి ద్వారా జంతువుల నుంచి మనుషులకు పాకిందని చెబుతున్నారు. అంతేకాకుండా.. భారత్‌లోని అరకొర వైద్య వసతులు, అధికంగా ఉన్న యువ జనాభా కారణంగా ఈ వైరస్ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపించిందని అంటున్నారు. ఇప్పటివరకూ గుర్తించిన వైరస్ స్ట్రెయిన్ల జన్యుక్రమం విశ్లేషణ ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని వారు చెబుతున్నారు.

ఇటీవల చైనా దిగుమతి చేసుకున్న ఆహార వస్తువుల్లో కరోనా వైరస్ బయటపడటమే ఈ వాదనలకు మూలంగా కనిపిస్తోంది. ఇక అక్కడి నుంచి చైనా వర్గాలు కరోనా నెపాన్ని ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నాలు మొదలెట్టాయి. ఈ క్రమంలోనే వారు ఇతర దేశాలతో పాటూ భారత్‌ను కూడా తమ లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ ఆరోపణలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు చైనా ప్రభుత్వ మీడియా కూడా తన వంతుగా సాయం చేస్తోంది. అయితే..ఇటువంటి వాదనల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కాస్త గట్టిగానే స్పందించింది. కరోనా వైరస్ చైనాలో పుట్టలేదని ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పడం ఊహాగానమే అవుతుందని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ కార్యక్రమాల చీఫ్ మైక్ రయాన్ వ్యాఖ్యానించారు.. చైనా వాదనలన్ని అభూతకల్పనలని చెప్పకనే చెప్పారు.

అయితే క‌రోనా చైనాలో పుట్ట‌లేద‌ని ఇత‌ర దేశాల్లోనే పుట్టింద‌ని చైనా చెబుతూనే ఉంది. ఇటలీలో తొలుత కరోనా పుట్టిందని వాదించింది. ఆ తరువాత అమెరికా, యూరప్ దేశాలపై నెపం నెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఏ ఒక్క సందర్భంలోనూ తన ఆరోపణలకు దన్నుగా ఆధారాలు చూపించలేదు.. ఇతర దేశాల నిపుణులు కూడా ఈ వాదనలను సమర్థించలేదు. కానీ.. చైనా ప్రభుత్వ వాదనకు వత్తాసు పలికేందుకు తాజాగా అక్కడి శాస్త్రవేత్తలు ముందుకు వచ్చారు. ఈసారి వారు ఏకంగా భారత్‌నే టార్గెట్ చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here