ఢిల్లీలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తుంటే మోదీ కీల‌క వ్యాఖ్య‌లు..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఆందోళ‌న‌ల‌కు దిగారు. గ‌త మూడు రోజులుగా ఢిల్లీ రైతుల ఆందోళ‌న‌ల‌తో అల్లాడుతోంది. ఈ ప‌రిస్థితుల్లో మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రైతుల కోసం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల గురించి ఆయ‌న వారణాసిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రైతుల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇన్నాళ్లూ చిన్ని మార్కెట్లకు పరిమితమైన రైతులకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్కెట్ కల్పించేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని, ఒకవేళ ఎవరైనా పాత విధానంలోనే లావాదేవీలు జరపాలనుకున్నా వారిపై ఎలాంటి ఒత్తిడి లేదని మోదీ చెప్పారు. ‘కొత్త చట్టాలు రైతులకు చట్టబద్ధమైన సంరక్షణ లభిస్తుంది. మార్కెట్ బయట జరిగే అక్రమ లావాదేవీలను నిలువరించడమే ఈ చట్టాల ముఖ్య ఉద్దేశమ‌న్నారు.

ప్రభుత్వం చట్టాలు చేసి.. వాటిని అమలు చేస్తుందన్నారు. అయితే వాటిని సమర్థించే వారితో పాటు వ్యతిరేకించేవారు కూడా ఉంటారన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు నచ్చని వారు స్వయంగా వాటిపై పోరాడేవారని మోదీ అన్నారు. కానీ ఇప్పుడు వెనకనుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. వారిలో భయాందోళనలు కలిగించి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే ధ్యేయంగా పన్నాగాలు పన్నుతున్నారని తెలిపారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల వ‌ల్ల ప్ర‌జ‌ల్లో భ‌యం పుట్టించాల‌ని చూస్తున్నార‌న్నారు. రైతు రుణ మాఫీ పేరుతో అక్కడి ప్రభుత్వాలు పెద్ద పెద్ద ప్యాకేజీలు ప్రకటించేవని, కానీ ఆ ప్రతిఫలాలు కింది స్థాయి రైతులకు అందేవి కాదని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు ప్రకటించిన వందల కోట్ల పథకాలు ప్రకటిస్తే వారికి కేవలం 15 పైసల వంతే చేరుతుందని, అంటే పథకాల్లో కూడా రైతులు మోసపోతున్నారని మోదీ అన్నారు. రైతుల‌కు మాటిస్తున్న‌ట్లు మోదీ చెప్పారు. స్వామినాథన్ ఆయోగ్ చెప్పినదానికంటే ఎక్కువ ధ‌ర రైతుల‌కు అందుతుంద‌ని తెలిపారు. ఇవి కేవ‌లం మాట‌లు గానే కాకుండా చేత‌ల్లో చేసి చూపిస్తామ‌న్నారు. రైతుల ఖాతాల్లో డ‌బ్బులు ప‌డే వ‌ర‌కు బాధ్య‌త త‌న‌ది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here