అమెరికా అధ్య‌క్షుడికి శుభాకాంక్ష‌లు తెలిపిన చైనా.. ఎందుకంటే..

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల గురించి ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూసింది. జో బైడెన్ విజ‌యం సాధించారు. అయితే ఈ విష‌యంలో బైడెన్‌కు ప్ర‌పంచ దేశాల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి. అయితే కొంద‌రు మాత్రం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల విష‌యంలో మౌనంగా ఉన్నారు. వారిలో చైనా, ర‌ష్యా, మెక్సికో దేశాలు ఉన్నాయి.

అయితే చైనా ఏమ‌నుకుందో ఏమో కానీ ఇన్నాళ్ల‌కు మౌనం వీడింది. అమెరికా ప్రజల తీర్పును మేం గౌరవిస్తున్నాం. బైడెన్, హారిస్‌లకు అభినందనలు తెలిపాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. రష్యా, మెక్సికోలు ఇప్పటికీ మౌనం వీడలేదు. కాగా అమెరికా చైనాకు నిప్పుల కొలిమిగానే ఇన్నాళ్లూ ఉంది. అధ్య‌క్షుడు ట్రంప్ చైనా విష‌యంలో పూర్తిగా వ్య‌తిరేకంగా ఉండేవారు.

అమెరికాలోని చైనీస్ టెక్ కంపెనీలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని, గూఢచర్యం చేస్తున్నాయని ఆరోపిస్తూ వాటిపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజం హువావే విషయంలో కఠినంగా వ్యవహరించారు. చైనీస్ పేరెంట్ కంపెనీ బైడ్‌డ్యాన్స్‌కు చెందిన ‘టిక్‌టాక్’ను నిషేధించారు. క‌రోనా విషయంలో మ‌రింత దూరం పెరిగింది. చైనా నుంచే క‌రోనా వ‌చ్చింద‌ని ట్రంప్ ఎన్నోసార్లు అన్నారు. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య అమెరికా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం.. అధ్య‌క్షుడిగా బైడెన్ ఎన్నిక కావ‌డం జ‌రిగింది.

కానీ ఎన్నిక‌ల ఫలితాలు వ‌చ్చిన వారం రోజుల త‌ర్వాత చైనా ఇప్పుడు స్పందించింది. అయితే ఇప్పుడు అమెరికా, చైనా మ‌ధ్య సంబంధాలు మెరుగుప‌డ‌తాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అనుకుంటున్నారు. కానీ ఇది సాధ్యం కాద‌ని ప‌లువురు వారిస్తున్నారు. మ‌రి అమెరికా, చైనాల మ‌ధ్య ఏం జ‌రుగుతుందో మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక భార‌త్ విష‌యంలో అమెరికా ఎప్ప‌టికీ సానుకూలంగానే ఉంటుంద‌ని మేధావులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here