పాకిస్తాన్ కాల్పులు.. ముగ్గురు సైనికుల‌తో పాటు మ‌రో ముగ్గురు సాదార‌ణ పౌరులు మృతి..

పాకిస్తాన్ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా పాక్ జ‌రిపిన కాల్పుల్లో భార‌త్‌కు చెందిన‌ ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. ఇందులో ముగ్గురు జ‌వాన్లు ఉండ‌గా.. మ‌రో ముగ్గురు సాదార‌ణ పౌరులు. పాక్ దుశ్చ‌ర్య‌ను యావ‌త్ దేశం తీవ్రంగా ఖండిస్తోంది.

ఉరి సెక్టర్‌లో ఇద్దరు భారత సైనికులు, హాజీ పీర్ సెక్టర్‌లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేశ్ దోవల్ పాక్ జ‌రిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఉరి సెక్ట‌ర్‌లో ఇద్ద‌రు సాదార‌ణ పౌరులు, బాల్‌కోట్‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పాక్ 3,800 సార్లు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు అధికారికంగా తెలుస్తోంది. రక్షణ శాఖ అధికార ప్రతినిథి తెలిపిన వివరాల ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాట్ల కోసం పాకిస్థాన్ దళాలు ప్రయత్నించాయి.

దీనిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. బందిపొర జిల్లాలోని గురేజ్, కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టర్లలో పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయి. పాకిస్థాన్ దళాలు కేరన్ సెక్టర్‌లో మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ దళాల దుశ్చర్యలను భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టినట్లు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here