చైనా, పాకిస్తాన్ కావాల‌నే వివాదం చేస్తున్నాయ‌ట‌..

దేశ స‌రిహ‌ద్దులో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌పై ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ రెండు దేశాల‌పై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ మిషన్‌లో భాగంగానే చైనా సరిహద్దు వివాదాలను సృష్టిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటూనే, సరిహద్దులు సహా వివిధ ప్రాంతాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.

ఉత్తర, తూర్పు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నారో అంద‌రికీ తెలిసిందే అన్నారు. తొలుత పాకిస్థాన్ ఆ పని చేయగా, ఇప్పుడు చైనా కూడా అదే పనిచేస్తోందన్నారు. ఓ ప్రత్యేక లక్ష్యంతో చైనా సరిహద్దు వివాదాలను సృష్టిస్తున్నట్టు అనుమానంగా ఉందన్నారు. మనకు ఈ రెండు దేశాలతో 7 వేల కిలోమీటర్ల సరిహద్దు ఉందని ఆయ‌న తెలిపారు. తూర్పు లడఖ్‌లో భారత్, చైనా సరిహద్దు వద్ద గత ఐదు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఇరు దేశాల సైనికుల స్టాండాఫ్ కొనసాగుతోంది.

ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరు దేశాల మధ్య వరుసగా దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడడం లేదు. గ‌త రెండేళ్ల‌లో స‌రిహ‌ద్దులోని కొండ ప్రాంతాల్లో 2200 కిలోమీట‌ర్ల ర‌హ‌దారులు నిర్మించారు. వీటిలో చాలా వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌టంతో పాటు సైన్యం తేలికగా ఆయుదాలు త‌ర‌లించేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కాగా స‌రిహ‌ద్దులో క‌ష్ట‌ప‌డి కొండ ప్రాంతాల్లో రోడ్లు వేసిన బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌కు అభినంద‌న‌లు వ‌చ్చిప‌డుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here