చెవిరెడ్డి.. సూక్ష్మం గ్రహించాలి..!!

ఆల్రెడీ తెలుగుదేశం పాలన మీద ప్రజల్లో బోలెడంత వ్యతిరేకత ఉంది. ఆ ప్రజల్లో ప్రభుత్వోద్యుగులు కూడా ఒక భాగమే. తెలుగుదేశం నేతలు ప్రభుత్వ ఉద్యోగులతో ఎలా ప్రవర్తిస్తున్నారో.. అందరం చూస్తూనే ఉన్నాం. డైరెక్టుగా దాడులకే తెగబడుతున్నారు తమ్ముళ్లు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి, విజయవాడ ఆర్టీవో ఆఫీసులో చోటు చేసుకున్న పరిణామాలు.. జగమెరిగినవే. అవేగాక.. తెలుగుదేశం పార్టీ నేతల రుబాబు గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. గ్రామస్థాయిల్లో తెలుగుదేశం నేతలు ప్రభుత్వాధికారుల పాట నియంతలుగా మారారు.
ఇక ఇవన్నీ వద్దు.. గత మూడేళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెబుతున్నాడో చూస్తూనే ఉన్నాం. తమ పార్టీ కార్యకర్తలు చెప్పిన పనులు చేయాలని.. బాబు స్వయంగా అనేకసార్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వోద్యుగులు తెలుగుదేశం పార్టీకి బానిసలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు.
మరి ఇలాంటి నేపథ్యంలో అలాంటి ఉద్యోగుల్లో తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు పాలన మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే వారి శక్తిని తక్కువ అంచనా వేయడానికి లేదు. కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఉద్యోగులే ముందుంటారు.
ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్లు, స్టూడెంట్స్, రైతులు, మహిళలతో పోలిస్తే ఉద్యోగుల్లో ఓటు వేసే వారి శాతం  ఎక్కువ. చదువుకున్న వాళ్లలో బోలెడంత మంది ఓటు హక్కును వినియోగించుకోరు కానీ.. ఉద్యోగులు మాత్రం ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే. అంతో ఇంతో ఫలితాలను ప్రభావితం చేసే శక్తి వీరికి కచ్చితంగా ఉంది. వారితో ఆటలు ఆడుతూ తెలుగుదేశం పార్టీ దూరం చేసుకుంటోంది.
ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు అసమర్థ, అనుచిత పాలన నేపథ్యంలో వైకాపా ఉద్యోగులను చేరదీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. బాబు అంటే నే ఉద్యోగులకు పెద్దగా పడదు కూడా. మరి ఇలాంటి నేపథ్యంలో వైకాపా నేతలు వీలైనంతగా ప్రభుత్వోద్యుగులకు భరోసాను ఇవ్వాలి.. వారిని చేరదీయడానికి అవకాశాలను వెదుక్కోవాలి. అయితే అన్ని చోట్ల దురుసు తనం తగదు.
ప్రత్యేకించి మేము అధికారంలోకి వస్తే ఉద్యోగులపై .. అంటూ మాట్లాడుతున్న చెవిరెడ్డి లాంటి వాళ్లు తమ ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వోద్యులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటే.. అది వారి తప్పు కాదు. తప్పక చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాము వస్తే అలాంటి ఒత్తిళ్లు ఉండవని వైకాపా భరోసాను ఇవ్వాలి.
అంతే కానీ.. అనుచితమైన మాటలు కాదు. ఇలాంటి మాటల వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. వైకాపా వాళ్లు ఇది గ్రహించాలి. ఇప్పుడేదో చెవిరెడ్డి దారుణంగా మాట్లాడేశాడు అని కాదు కానీ, చెవిరెడ్డి మాటలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం అనుకూల మీడియా  రచ్చ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి అవకాశం కూడా వైకాపా నేతలు ఇవ్వకూడదు. మీడియా వారికి ఎగనైస్ట్ గా ఉంది కాబట్టి.. ఆచితూచి వ్యవహరించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here