అంత మాట్లాడారు సరే.. వీటికి సమాధానం చెబుతారా?

పాడిందే పాట.. అని తెలుగులో ఓ సామెత ఉంది. చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పేవాళ్లను ఉద్దేశించి ఈ మాట అంటుంటారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే ఇదే మాట అనాల్సి వస్తోంది. సందర్భం దొరికినా దొరక్కపోయినా.. హైదరాబాద్ అభివృద్ధి గురించి పదే పదే చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. దొరికిన అవకాశాన్ని.. తన పాత ప్రసంగాన్ని వల్లె వేయడానికి మళ్లీ ఉపయోగించుకున్నారు.
ఇందులో భాగంగా.. అభివృద్ధికి పునరంకితం కావాలని చెప్పారు… కానీ.. ముందు ముందు ఏం చేయబోతున్నారు.. ఇప్పటివరకూ చేసిన పనుల ఆధారంగా సాధించిన ఫలితాలు ఏంటన్నది మాత్రం చెప్పలేకపోయారు.
పార్లమెంట్ లో ఎంపీలపై దాడి చేసి యూపీయే ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది అని ఆరోపించారు.. కానీ.. తనే స్వయంగా తెలంగాణకు మద్దతుగా లేఖ రాసి ఇచ్చిన విషయాన్ని మాత్రం తెలివిగా ప్రస్తావించనే లేదు.
రాష్ట్రాన్ని మిగతా వాళ్లు అసూయపడేలా అభివృద్ధి చేసుకుందాం అన్నారు కానీ.. జిల్లాకో పరిశ్రమ తెస్తా.. ప్రతి ఊరినీ బాగు చేస్తా.. అంటూ మొదటి కేబినెట్ సమావేశం తర్వాత ఇచ్చిన ప్రణాళిక ఎంతవరకూ అమలైందో.. మాట మాత్రం కూడా బాబు గారు ప్రస్తావించనే లేదు.
రాజధాని కూడా లేని రాష్ట్రానికి.. కనీసం ఆస్పత్రులు కూడా లేని ప్రాంతం నుంచే.. బస్సులో ఉంటూనే పరిపాలిస్తున్నానని అన్నారు. బాగుంది. కానీ.. ఓటుకు నోటు కేసు తర్వాత.. హడావుడిగా పరిపాలన యంత్రాంగాన్ని పూర్తిగా అమరావతి తరలించారే.. ఆ విషయంపై ఏమన్నా బ్రీఫితే బాగుండేది అని జనం అనుకున్నారు.
అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు బాగుంది కానీ..  ఓటుకు నోటు కేసులో వినిపించింది చంద్రబాబు గొంతే కదా.. మరి అప్పుడు చేసింది అవినీతి కాదా.. అని అమాయక జనం తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు.
ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. ఇది అంతకన్నా బాగుంది కానీ.. ప్రత్యర్థి పార్టీల లీడర్లను టీడీపీ నేతలు చంపుతుంటే.. ఆ పార్టీ అధినేతగా.. హత్యలను అడ్డుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా ప్రజల గుండెల్లో ఉంటారు చంద్రబాబు గారూ.. అని జనం ప్రశ్నిస్తున్నారు.
అందరికీ అందుబాటులో ఉండాలనే విజయవాడ గుంటూరు మధ్య రాజధానిని నిర్మిస్తున్నా అన్నారు. కానీ.. రాజధాని నిర్మాణంలో వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎందుకు స్పందించలేదని జనం నిలదీస్తున్నారు.
ఇంకా.. ఇంకా.. బాబు ప్రసంగంలో ప్రతి పాయింట్ కూ.. ఏదో ఒక రకంగా జనం నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ.. వీటికి తెలుగుదేశం పార్టీ నేతలు కానీ.. చంద్రబాబు కానీ సమాధానం చెప్తారా.. ఏమో.. వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here