తెలంగాణ ప్ర‌జ‌ల్ని చంద్ర‌బాబు అవ‌మానించారా?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు. ఇష్యూ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా స‌రే.. భావోద్వేగ సెంటిమెంట్ ను బ‌య‌ట‌కు తీసి వ‌ణికిపోయేలా ఆరోప‌ణ‌లు చేసే స‌త్తా టీఆర్ఎస్ నేత‌ల సొంతం. ఆ పార్టీ అధినేత మొద‌లు కొని ఒక స్థాయి నేత వ‌ర‌కూ వినిపించే వాద‌న‌ల్ని విన్నంత‌నే నిజ‌మ‌నిపంచేలా వ్యాఖ్య‌లు చేస్తుంటారు.
మొన్న‌టికి మొన్న తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు తెలంగాణ ప్ర‌జ‌ల్ని  ఘోరంగా అవ‌మానించార‌ని.. వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఇప్పుడు ఇంచుమించే అదే రీతిలో బాబుపై విరుచుకుప‌డ్డారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌జ‌లు పండుగ చేసుకుంటూ.. చీక‌టి రోజంటూ తెలంగాణ ప‌ట్ల బాబు త‌న‌కున్న అక్క‌సును మ‌రోసారి వెళ్ల‌గ‌క్కార‌ని మండిప‌డ్డారు. ఏపీలో అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.. త‌న పాల‌నా వైఫ‌ల్యాల్ని క‌ప్పిపుచ్చుకోవ‌టానికే తెలంగాణ‌పై విషం క‌క్కుతున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి చంద్ర‌బాబు ప‌ని చేయ‌టం లేద‌ని.. అభివృద్ధిలో వెనుక‌ప‌డిపోయార‌ని ఏపీ ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారని..ఈ ప‌రిస్థితికి ఏం చేయాలో అర్థం కాక తెలంగాణ మీద విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు.  అభివృద్ధిపై ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శ్న‌లు వేస్తుంటే స‌మాధానాలు చెప్ప‌లేక‌.. ఏం చేయాలో తెలియ‌క త‌న అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పిపుచ్చుకోవ‌టానికి విభ‌జ‌న‌పై నెపం నెడుతున్నార‌ని.. తెలంగాణ‌పై విషం చిమ్ముతున్నార‌ని హ‌రీశ్ ఫైర్ అయ్యారు.
స‌మ‌ర్థ‌వంతంగా పాల‌న సాగించాలే కానీ.. ఇత‌రుల్ని ఆడిపోసుకోవ‌టం మానాలంటూ హిత‌వు పలికిన హ‌రీశ్‌.. త‌క్ష‌ణ‌మే చంద్ర‌బాబు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని హెచ్చ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here