చంద్ర‌బాబు ఆశ‌లు.. చేజారుతున్న నేత‌లు..

తెలుగుదేశం పార్టీ ఖాలీ అవుతుందా అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తున్న వారు అవున‌నే స‌మాధానం చెబుతారు. ఎందుకంటే ఏపీలో ఆ పార్టీ నేత‌లు ఒక్కొక్క‌రు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గణేష్ వైసీపీలో చేర‌డంతో టిడిపి ప‌రిస్థితిపై మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ, ముద్దాలి గిరి, క‌ర‌ణం బ‌లారంలు జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేర‌గా.. ఇప్పుడు వాసుప‌ల్లి గ‌ణేష్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఇక తెలుగుదేశం పార్టీకి మిగిలింది కేవ‌లం 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. ఎన్నిక‌ల్లో 23 మంది మాత్ర‌మే విజ‌యం సాధించ‌గా.. వారిలో న‌లుగురు త‌మ‌దారి తాము చూసుకున్నారు. ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధి, వై.ఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలో ముందుకు వెళ్లేందుకు వారు టిడిపిని వీడి వైసీపీలో చేరారు.

అయితే పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారి పట్ల చంద్ర‌బాబు ఎప్ప‌టిలాగే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్‌రెడ్డి జే ట్యాక్స్‌ రూపంలో వందలు… వేల కోట్ల రూపాయలు లూఠీ చేస్తున్నారన్నారు. అవి విసిరి ప్రలోభాల ఎరలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు. వైసీపీ అవినీతి, అరాచకాలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్ళించడానికే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. నాయకులు వస్తారని పోతార‌ని అయితే కార్య‌క‌ర్త‌ల అభిమానం ఉన్నంత‌కాలం టిడిపికి ఢోకా లేద‌న్నారు.

కాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు న‌వ్వుకుంటున్నారు. ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు ఎమ్మెల్యేల‌ను పార్టీ మార్పించుకొని మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన వైనాన్ని ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేద‌ని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధితో పాటు, మూడు రాజ‌ధానుల విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న స‌రైన నిర్ణ‌యాల వ‌ల్ల ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌ని మేధావులు అంటున్నారు. తెలుగుదేశం ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా ఎమ్మెల్యేల మ‌న‌సును మార్చ‌లేద‌న్నారు. చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్లే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఇప్పుడున్న 19 ఎమ్మెల్యేల్లో ఎంత మంది టిడిపి వైపు ఉంటారోన‌న్న ఆందోళ‌న కూడా ఆ పార్టీలో నెల‌కొంది. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఆ ముహూర్తం ఎప్పుడో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here