బీజేపీ తీర్ధంపుచ్చుకోనున్న బైరెడ్డి..?

ప్రజలు ఆదరిస్తేనే ఏ పార్టీ అయినా పదికాలాల పాటు పదలింగా ఉంటుంది. మరి ప్రజలే ఆదరించకపోతే ఆ పార్టీ పరిస్థితేంటి.. ఆ పార్టీనే నమ్ముకున్న నాయకుడి పరిస్థితేంటి? మొన్న నంద్యాల ఎన్నికల్లో రాయలసీమ పరిరక్షణ సమితికి కేవలం 154 ఓట్లు మాత్రమే రావడంతో.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి యూ-టర్న్ తీసుకున్నారు. ఆర్పీఎస్ ను కాలంలో కలిపేశారు. మరి తదుపరి ఆయన చేరే పార్టీ ఏది? ఇప్పుడు సీమ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిగ్గా మారింది.
 నంద్యాల ఉప ఎన్నికల ఘాటుకు రాయలసీమ పరిరక్షణ సమితి… ఆర్పీఎస్ చాప చుట్టేసింది. రాష్ర్టాన్ని విభజించిన కాంగ్రెస్ కు 1382 ఓట్లు రాగా.. ఏ పార్టీ నాయకుడూ బాగా లేడన్న నోటాకు 1231 ఓట్లు పడ్డాయి. కానీ పాదయాత్రలు.. ట్రాక్టర్ యాత్రలు.. బస్సు యాత్రలు చేసి సీమ వాదాన్ని బలంగా వినిపించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి పార్టీకి కేవలం 154 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ పరిణామం ఆర్పీఎస్ అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డిని తీవ్రంగా కలచివేసింది. ఆర్పీఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో తన సొంత గ్రామమైన ముచ్చుమర్రిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఆర్పీఎస్ ను మూసేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే చెబుతానంటూ వాయిదా వేశారు. బైరెడ్డి నాన్చుడు ప్రకటన పరోక్షంగా అనేక ఉహాగానాలకు తెర లేపింది.
ఆర్పీఎస్ ను మూసేస్తున్నట్లు బైరెడ్డి ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి కర్నూలు జిల్లాకు రావడం.. బైరెడ్డి స్వగ్రామానికి దగ్గరలో ఉన్న మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్శించడం అనేక కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ప్రాజెక్టులను సందర్శించిన సందర్భంగా పురంధేశ్వరి స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ కష్టాలు తీర్చే సిద్ధేశ్వరం, గుండ్రేవుల, ఆర్డీఎస్ తదితర ప్రాజెక్టులను బీజేపీ పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమని పురందేశ్వరి ప్రకటించారు.
బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి కర్నూలు జిల్లాలో ఆకస్మికంగా పర్యటించడం.. సీమ ప్రాజెక్టులపై కేంద్రం వైఖరిని స్పష్టం చేయడం తదితర పరిణామాలు కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. ఐదేళ్లపాటు అధికార, విపక్షా ఎండగట్టిన బైరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం దావానలంలా వ్యాపించింది. పురంధేశ్వరి ఆకస్మిక పర్యటన.. రాజకీయ ప్రకటనలు జిల్లాలో జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ పర్యటనలో ఆయనతో భేటీ అయ్యే అవకాశం రాలేదని పురందేశ్వరికి రాలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో బీజేపీకి బలమైన అండగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి 2019 ఎన్నికల నాటికి పార్టీ మారనున్నారని ప్రచారం జరుగుతోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వెళ్లిపోతే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైరెడ్డిని దీటైన ప్రత్యామ్నాయంగా బీజేపీ విశ్వసిస్తున్నట్లు సమాచారం. అందుకే బైరెడ్డితో మంతనాలు సాగించి.. కమలం గూటికి చేర్చే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ బైరెడ్డి అభిమానులు మాత్రం తమ నాయకుడు టీడీపీలో చేరతాడని బలంగా నమ్ముతుండడం విశేషం.
ఆర్పీఎస్ ను మూసేసిన బైరెడ్డి ఏ పార్టీ పంచన చేరతారనే ఊహాగానాలకు తెర పడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది. ఈ నెల 12 లేదా 16న బైరెడ్డి తన మనసులో మాటను.. ప్రకటిస్తారని సమాచారం. బైరెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతోందనేదానిపై ఆయన కార్యకర్తలే కాదు.. మొత్తం ఏపీ రాజకీయ నేతలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here