బీజేపీ టార్గెట్ త‌మిళ‌నాడు.. ర‌జినీకాంత్ వైఖ‌రిపైనే స‌స్పెన్స్‌..

త‌మిళ‌నాడులో వ‌చ్చే సంవ‌త్స‌రం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ మేర‌కు చెన్నై ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన అమిత్‌షా కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించారు. దీంతో అక్క‌డి రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి.

అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనలను రూపొందించే నిమిత్తమే అమిత్‌షా చెన్నైకి విచ్చేశారు. చెన్నై ఎంఆర్‌సీ నగర్‌ లీలాప్యాలెస్‌ హోటల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను అన్నాడీఎంకే ఉపసమన్వయకర్త, సీఎం ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలుసుకున్నప్పుడు సీట్ల సర్దుబాట్లకు సంబంధించి చర్చలు జరిగాయి. అమిత్‌షా సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి కనీసం 40 స్థానాలు కేటాయించాలని ఒత్తిడి చేశారు. ఆ సందర్భంగా ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం బదులిస్తూ అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు ఓటు బ్యాంకు కలిగిన డీఎండీకే, పీఎంకేలకు తలా 20 సీట్లను కేటాయించాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో 20 లేదా 25 సీట్లతో సరిపెట్టుకోమని సూచించారు.

అమిత్‌షా జోక్యం చేసుకుంటూ ఈ సారి రాష్ట్రంలో బీజేపీ పది పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలో గెలవాలని నిర్ణయించిందని, ఆ మేరకు 40 సీట్లలో పోటీ చేస్తేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఐదు నియోజకవర్గాలు కేటాయించామని, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు నుంచి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయని, ఆ లెక్కన ఈసారి 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం తెలిపారు. ఈ విషయమై మరోమారు బీజేపీ రాష్ట్ర నాయకులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోమంటూ అమిత్‌షా ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంను కోరారు.

కాగా అమిత్‌షా చెన్నై ప‌ర్య‌ట‌న‌లో క‌చ్చితంగా ర‌జినీకాంత్‌తో స‌మావేశం ఉంటుంద‌ని అంతా అనుకున్నా అది జ‌ర‌గ‌లేదు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ఖరారరు కావడంతో రజనీ, అమిత్‌షాల భేటీకి అవకాశం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లోనే లీలాప్యాలెస్‌ హోటల్‌ ఉన్న అమిత్‌షాను రజనీకాంత్‌ సన్నిహితుడు గురుమూర్తి కలుసుకున్నారు. ఈ నెల 1న గురుమూర్తి పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి రజనీకాంత్‌తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు చర్చించారు. ఆ సమయంలో బీజేపీ తనను ఆశిస్తున్న విషయాలను గురించి గురుమూర్తి వద్ద రజనీ అడిగి తెలుసుకున్నారు. గురుమూర్తి బీజేపీ జాతీయ నాయకుల అభిప్రాయాలను రజనీకి వివరించారు. అదే సమయంలో రజనీ తన వ్యక్తిగత పరిస్థితి, రాజకీయ స్థితిగతులు, తాను ఎదురుచూస్తున్న మార్పులపై గురుమూర్తితో చర్చించారు. శనివారం రాత్రి అమిత్‌షాను కలుసుకున్న గురుమూర్తి… రజనీతో చర్చించిన విషయాలన్నింటినీ సమగ్రంగా వివరించినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర శాఖ తరఫు సమాచారాన్ని అమిత్‌షా గురుమూర్తికి వివరించారు. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రజనీ మద్దతు అవసరమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా భావిస్తున్నారు. ఆ దిశగా అమిత్‌షా త్వరలో పావులు కదుపనున్నారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here