గురి చూసి కొడితేనే బాణం త‌గులుతుంద‌ని బీజేపీ గ్ర‌హించ‌డం లేదా..

కేంద్రంలో అధికారం చేప‌ట్టిన భార‌తీయ జ‌న‌తా పార్ట ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల వైపు చూడ‌టంలో అశ్చ‌ర్య‌మేమీ లేదు. అయితే అందుకు త‌గ్గ దీర్ఘ‌కాలిక‌ ప్ర‌ణాళిక ఎంతో అవ‌స‌రం. అయితే ఆ పార్టీ పెద్ద‌ల‌కు ఇది తెలియ‌నిది కాదు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ ఎంచుకుంటున్న దారులు.. అందులో జ‌నాన్ని చైత‌న్య వంతుల్ని చేసే విధానం మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రెక్టుగా లేద‌ని తెలుస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎద‌గాల‌ని చూస్తోన్న బీజేపీ అధిష్టానం అందుకు త‌గ్గ‌ట్టుగానే ముందుకు సాగుతోంది. ఇప్పటికే పార్టీ అధ్య‌క్షుడిగా మంచి నాయ‌కుడైన సోము వీర్రాజును పెట్టింది. అయితే ఆయ‌న కూడా ఏపీ రాజ‌కీయాల‌లో అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండి మాట్లాడుతున్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో డిస్క‌ష‌న్ ఉంది. అయితే బీజేపీకి చాన్స్ ఇవ్వ‌కుండా అధికార పార్టీ వ్య‌వ‌హ‌రిస్తోంది ఇక్క‌డ‌. ప్రధానంగా ఏపీలో వైసీపీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తూ ప‌రిపాల‌న సాగిస్తున్నారు.

ప్ర‌ధానంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుచేస్తూ ప్ర‌జ‌ల మ‌న‌స్సు గెలుచుకుంటున్నార‌ని టాక్‌. అయితే ఆ త‌ర్వాత ఉన్న‌ట్టుండి క‌రోనా రూపంలో పెద్ద విపత్తు రావ‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే దీనిపై మొద‌ట్లో సీఎం జ‌గ‌న్ పారాసిట‌మాల్ అంటూ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. క‌రోనాతో క‌లిసి మనం జీవించాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న భ‌విష్య‌త్తు చెప్పార‌ని అంతా అనుకున్నారు. కానీ చివ‌ర‌కు మిగిలింది మాత్రం క‌రోనాతో జీవ‌న‌మే.

ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని అనుకున్నా చివ‌ర‌కు జ‌రిగింది మాత్రం ఇదే. అయితే ఇప్ప‌డు దేశంలోనే ఏపీ బెస్ట్ స్టేట్‌గా ఉంది. క‌రోనా ప‌రీక్ష‌ల్లో ముందంజ‌లో ఉన్నాం. రిక‌వ‌రీ రేటులో మంచి వృద్ధి సాధించాం. హాస్పిట‌ల్స్లో కూడా మౌళిక స‌దుపాయాలు, ఇత‌రత్రా విష‌యాల్లో సీఎం జ‌గ‌న్ ముందుండి అధికారుల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తూ ముందుకు న‌డిపిస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో కొట్టుమిట్టాడుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న ప‌రిపాల‌న మాత్రం స‌జావుగానే సాగుతోంది.

ఇంత చేస్తున్న వై.ఎస్ జ‌గ‌న్‌ను కాద‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఇత‌ర పార్టీలు, నాయ‌కుల వైపు ఎందుకు చూస్తార‌నేది మాత్రం ఇప్పుడు త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌. అయితే ప‌లు పార్టీల‌కు విధేయులుగా ఉన్న వారు కూడా జ‌గ‌న్ చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితుల‌య్యారంటే అతిశ‌యోక్తి కాదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వై.ఎస్ జ‌గ‌న్ మ‌రో ప‌దేళ్ల పాటు అధికారంలోకి వ‌స్తారంటున్న పుకార్లు నిజం అయ్యేట్లే క‌నిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎద‌గాల‌ని నిర్ణ‌యించుకొని ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న బీజేపీకి చాన్స్ ఉంటుందా అన్న‌దే ఇప్పుడు అంద‌రి ఆలోచ‌న‌.

అయితే ఇటీవ‌ల ఆపార్టీ నేత‌లు రాష్ట్రంలో జ‌రుగుతున్న మ‌త ప‌ర‌మైన విష‌యాల్లో అవ‌లంబిస్తున్న తీరు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డం లేద‌న్న టాక్ ఉంది. ఎందుకంటే ఆల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం స్పందిస్తున్న తీరు కూడా బాగానే ఉంది. ఏ ఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లి ప‌ర‌శీలించి అవ‌స‌ర‌మైతే ద‌ర్యాప్తుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్లేందుకు సిద్ద‌మ‌న్న సంకేతాలు ప్ర‌భుత్వం నుంచి వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై నెగిటివ్ టాక్ రావ‌డం లేదని ప‌లువురు చెబుతున్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్లో మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తే ప్ర‌జ‌లేమీ పిచ్చోళ్లు కాద‌ని.. ఎవ‌రు ఏం చేస్తున్నారో అన్నీ గ్ర‌హిస్తుంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి పార్టీలు కూడా అవ‌స‌ర‌మైన మేర‌కే స్పందించి త‌మ క‌ర్త‌వ్యం నిర్వ‌ర్తించాలి త‌ప్ప ఇంకోలా డైవ‌ర్ట్ అవ్వ‌కూడ‌ద‌ని మేధావులు చెబుతున్నారు. అధికార పార్టీ నిజంగా ఫెయిల్ అయితే ఆ విష‌యాల‌ను క్యాష్ చేసుకొని ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేయాలి త‌ప్ప కొని ఘ‌ట‌న‌ల ఆధారంగా బ‌ల‌ప‌డాల‌ని చూస్తే అయ్యేప‌ని కాద‌ని.. ఇలా చేస్తే గురి త‌ప్పినట్లు అవుతోంద‌ని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here