ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగేందుకే ఎక్కువ అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయా.. ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ద‌మైంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అనువైన స‌మ‌యం కాద‌ని చెబుతోంది. క‌రోనా పూర్తిగా త‌గ్గిపోయిన త‌ర్వాత రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని గ‌ట్టిగా చెబుతోంది.

అయితే ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ మాత్రం ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఉద్దేశంతో ఉన్నారు. ఈమేర‌కు ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌లిశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని ముందుగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశంపై సీఎస్ నీలం సాహ్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం తెలుపుతూ సీఎస్ లేఖ రాయడంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేశారు.

అయితే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఈసీ అనుకుంటే నిర్వ‌హించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్-19 మహమ్మారి సమయంలో బిహార్ శాసన సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంతో ఆత్మవిశ్వాసం బలపడిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా బుధవారం చెప్పారు. అన్ని వైపుల నుంచి వస్తున్న ప్రశంసలతో వచ్చే ఏడాది నిర్వహించవలసిన శాసన సభ ఎన్నికలను కూడా సకాలంలో నిర్వహించగలమనే భరోసా ఏర్పడిందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎన్నికల కమిషన్ దుస్సాహసం చేస్తోందని తాము భావించే విధంగా కొందరు మాట్లాడారన్నారు. అయితే కమిషన్‌లో ప్రతి ఒక్కరికీ ఇది నమ్మకంతో వేసిన అడుగు అని, చీకట్లో దూకడం కాదని చెప్పారు. ఏ ఎన్నికల్లోనైనా తాము చాలా శ్రమించి పని చేస్తామని చెప్పారు. అయితే కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరింత భగీరథ ప్రయత్నం అయిందని చెప్పారు. ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రశ్నించినవారి అభిప్రాయం తప్పు అని నిరూపించారా అని అడిగినపుడు సునీల్ అరోరా స్పందిస్తూ, తాను ఆ విధంగా మాట్లాడటం అమర్యాదకరం అవుతుందన్నారు. మీడియా, ప్రజలు, ఓటర్లు, సంబంధితులు ఆ విషయం గురించి చెప్పాలన్నారు. ఎన్నికల కమిషన్ ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనగలదని, కోవిడ్-19మహమ్మారి సవాలుకు దీటుగా నిలిచిందని చెప్పారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కూడా ఎన్నిక‌ల సంఘం సిద్ధ‌మైన నేప‌థ్యంలో అడ్డంకులు ఏమీ ఉండ‌వ‌నుకోవ‌చ్చు. ఎందుకంటే ప‌క్క రాష్ట్రాల‌లో విజ‌య‌వంతంగా నిర్వ‌హించాం కాబ‌ట్టి ఇక్క‌డ కూడా మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్న భ‌రోసా ఈసీ క‌ల్పించొచ్చు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీహార్ ఎన్నిక‌ల విజ‌య‌వంతాన్ని సంకేతంగా చూపిస్తూ ముందుకు సాగుతుందేమో అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here