ఢిల్లీలో బిజీబిజీగా ఏపీ మంత్రులు, ఎంపీలు..

ఏపీకి చెందిన మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌తో పాటు ఎంపీలు ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్‌, లావు కృష్ణ దేవరాయలు ఏపీకి రావాల్సిన బ‌కాయిలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి  గజేంద్ర సింగ్‌ను క‌లిశారు. వీరి భేటి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కేంద్రం నుంచి రావాల్సిన బ‌కాయిలు రాబ‌ట్టేందుకే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఢిల్లీ వెళ్లి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోల‌వ‌రానికి కేంద్రం నిధులు ఇస్తుంది. అయితే కేంద్రం ఇచ్చే నిధుల‌పై ఆధార‌ప‌డకుండా ఏపీ ముందుగా ఖ‌ర్చు చేస్తూ వ‌స్తోంది. ఇప్పుడు ఈ బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని ఏపీ కేంద్రాన్ని కోరుతోంది. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని అనిల్ కుమార్ కేంద్ర మంత్రిని క‌లిసి వినతి పత్రం ఇచ్చారు.

2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ఏపీ సీఎం జ‌గ‌న్ లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి అనిల్ చెప్పారు. పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అనిల్ అన్నారు. మొన్న‌ పార్ల‌మెంటులో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. క‌రోనా స‌మ‌యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ‌ని చెప్పారు. అందుకే బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని కోరారు. జాతీయ ప్రాజెక్టు కాబ‌ట్టి నిధుల‌న్నీ కేంద్ర‌మే స‌మ‌కూర్చాలన్నారు. దీనికి స‌మాధానంగా ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ పోల‌వ‌రం నిధుల వినియోగంపై కాగ్ నివేదిక‌ను ఏపీ అంద‌జేసింద‌న్నారు.

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. రూ. 3805 కోట్ల బ‌కాయిలు త్వ‌ర‌లోనే చెల్లింపులు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కాగా మ‌రోసారి అఫిషియ‌ల్‌గా ఏపీ నుంచి కేంద్ర మంత్రిని క‌లిస్తే బాగుంటుంద‌న్న కార‌ణంతోనే మంత్రి అనిల్ నేడు ఢిల్లీలో విన‌తిప‌త్రం ఇచ్చార‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here