రైతుల ఆందోళ‌న‌ల వ‌ల్ల రైల్వేల‌కు అన్ని కోట్ల రూపాయ‌లు న‌ష్టం వ‌చ్చిందంట‌..

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం వీటిపై రైతుల‌తో చ‌ర్చించినా ఫ‌లితం లేక‌పోయింది. రైతులు ఇంకా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీ స‌రిహ‌ద్దులో రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే రైతుల ఆందోళ‌న‌ల వ‌ల్ల రైళ్లు కూడా నిలిచిపోయాయి.

రైతు ఆందోళనల కారణంగా భారత రైల్వేకు రూ.2,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు నార్తరన్ రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగల్ శుక్రవారంనాడు తెలిపారు. ప్రస్తుతం బియాస్, అమృత్ సర్ మధ్య ఒక సెక్షన్‌ దిగ్బంధంలో ఉన్నట్టు చెప్పారు. దీంతో తార్న్ తరణ్ జిల్లా గుండా ప్రత్యామ్నాయ మార్గంలో రైళ్లు నడుపుతున్నట్టు తెలిపారు. ఇది పొడవాటి సెక్షన్ కావడంతో అవసరానికి అనుగుణంగా ఎక్కువ రైళ్లు నడపలేకపోతున్నామని అన్నారు. తమ అంచనా ప్రకారం పంజాబ్‌లో రైల్వేలకు రూ.2,400 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్టు చెప్పారు.

కాగా, గత సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 24 వరకూ రెండు నెలల పాటు రైలు సర్వీసులను నిలిపివేశామ‌న్నారు. ప్రస్తుతం సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ రైతుల నిరసనలతో సమస్యలు తప్పడం లేదన్నారు. కాగా ఇప్ప‌టికీ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లోనూ, పంజాబ్‌లోనూ రైతు నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే రైతు చట్టాలపై తమతో విభేదించే వారితో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్ర‌ధాని మోదీ అన్నారు. రాజకీయాలు చేసే పార్టీలతో తమకు ఎలాంటి సమస్యా లేదన్నారు. అయితే, రైతులను తప్పదారి పట్టించవద్దని విపక్షాలను ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here