బాహుబలి కట్టప్పకి … మగధీర కాలభైరవుడు మేనల్లుడవుతాడా

మగధీర సినిమాలో కాలభైరవుడు క్యార‌క్ట‌ర్ , బాహుబలిలో కట్టప్ప గురించి ప్ర‌త్యేకంగా చెప్పే ప‌నిలేదు. ఎందుకంటే  ఈ రెండు సినిమాలో కాల‌బైరువుడు, బాహుబ‌లి క‌ట్ట‌ప్ప‌కు అంత పేరు వ‌చ్చింది కాబ‌ట్టి. అయితే  Bharadwaja Rangavajhala అనే ఆయ‌న  కాలభైరవుడి తండ్రి, కట్టప్ప నరకంలో కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారు. కట్టప్పకి..కాలభైరవుడికి రిలేషన్ షిప్ ఏంటనేదానిపై  రాసిన ఆర్టిక‌ల్  సోషల్ మీడియాలో రాసిన ఆర్టికల్ వైరల్ అవుతోంది. ఆయన ఏం రాశారో మీరే చదవండి.
ఒక రోజు కట్టప్పా … కాలభైరవుడి తండ్రీ … నరకంలో కలుసుకుని మాట్లాడుకుంటూంటారు . మధ్యాహ్నం భోజనాలయ్యాక వాళ్ల సెల్లు వసారలో చుట్టలు కాల్చుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు …
కాల తండ్రి : ఏటి బావా ఈ దుర్మార్గం మేమేటి రాజు కోసం సింహాసనం కోసం వందమందిని కనీసం చంపాలని రూలెట్టి దాని మీద మా వంశాన్ని పడుకోబెట్టారు … నా కొడుకునైనా ఈ రొంపిలోంచీ బైటేయాలంటే కుదిరేట్టు లేదు బావా … చిరాకొచ్చేస్తాంది …
కట్టప్ప : నీ సంగతి పర్వాలేదు బావా … నా సంగతెవడితో చెప్పుకోను … నాకో పెళ్లాం లేదు … కొంపలేదు … కట్టప్పా అని రాజభవనంలో ఎవురు పిల్చినా కత్తేసుకుని దూకి నిలబడాలి . నీకు కనీసం ఓ టార్గెట్టైనా ఉంది. వంద మందిని చంపి చావాలనే ప్రోగ్రాముంది. అది గౌరవప్రదమే …
కాలతండ్రి : ఛ ఊరుకో బావా ఏం మాట్లాడుతున్నావు … మాదీ ఓ బతుకేనా మా వంశంలో పిల్లలెవరూ తండ్రుల్ని చూడరు తెల్సా… మళ్లీ మేం పెళ్లాడాలి. ఒక పిల్లోణ్ణి కనాలి వాడు పుట్టి నాలుగడుగులేసేలోగా మాకు పాతికేళ్లు వస్తాయి .. విజయేంద్రప్రసాదు స్క్రిప్టు ప్రకారం మా వంశంలో ఎవడూ పాతికేళ్లకన్నా బతకకూడదు. పాతికేల్లు రాగానే యుద్దంలోకి పోవాల … వంద మందిని చంపి చచ్చిపోవాల … దీనమ్మ జీవితం ..
కట్టప్ప : అవును బావా … అసలు కాలభైరవుడు మిత్రవిందను ఎందుకు ఆ జన్మలో పెళ్లాడడో తెల్సా?
కాలతండ్రి : ఎందుకురా …
కట్టప్ప : అంటే … రాజుగారి అమ్మాయిని ఈడికిచ్చి చేసి పాతికేళ్ల వయసులోనే ముసుగేయించడం ఇష్టం లేక … రాజమౌళి విజయేంద్ర ప్రసాదు అలా డిసైడు చేశార్రా బావా …
కాల తండ్రి : మరి అక్కడే వాళ్లు పప్పులో కాలెట్టారు. వాడు మిత్రవందను పెళ్లాడకపోబట్టి మా వంశం లో ఇంకోడు పుట్టక ఆగిపోయింది కదా… మరి తర్వాత రాజులకు చచ్చి పెట్టడానికి బానిసనాకొడుకులెలారా … అదే ఆ మిత్రవందను వాడికిచ్చి చేసేసి ఉంటే … అది ముసుగేసినా … వందమందిని చంపి చచ్చే ఓ సూపరు బానిస వంశం కొనసాగేది కదరా …
కట్టప్ప : మరదే ఎటకారం అంటే … మీ వంశం చంకనాకిపోయాకే కదా మనోళ్లకి మా వంశాన్ని సింహాసనానికి బానిసల్ని చేయాలనే థాటొచ్చింది …
కాలతండ్రి : అంతేనంటావా …
ఇంతలో నరకం వార్డర్లు వచ్చి …
నెగునెగునెగ్గెహె ఈడ చుట్టలు కాల్చుకుంటా కూకుంటే అక్కడ గడ్డి ఎవడు పీకుతాడ్రా … లెగండి లెగండి … అన్నారు …
బావా బామ్మరుదులిద్దరూ గడ్డి పీకుతున్నట్టు నటిస్తూ మాట్లాడుకోసాగారు …
కట్టప్ప : మాహిష్మతి సింహాసనం కోసం ఏ పని పడితే ఆ పనిచేసి నేను గడ్డి పీకుతున్నాను బావా లేకపోతేనా హాయిగా స్వర్గంలో రంభా ఊర్వశులతో …
కాలతండ్రి : ఏడ్చినట్టుంది … ఏదో ఒచ్చి దేంతోనో మొరపెట్టుకున్నట్టుంది … మేమూ అంతేగా బావా … ఎవుడి కోసమో వంద మర్డర్లు చేసేసి గడ్డి పీక్కుంటూ కూచోడంలా … అట్టాగే ….
కట్టప్ప : అంతే బావా … మన బతుకులే కాదు … మన తర్వాత ప్రభుత్వాల తరపున జనాన్ని ఊచకోతలు కోసిన పోలీసోళ్లు కూడా చూడు ఆ పక్కన గడ్డి పీకుతున్నారు … కానీ … మనమొకటి చేసుంటే కనీసం కిందన్నా సుఖం దక్కేదని నేను నరకానికి వచ్చినకాణ్ణించీ అనుకుంటూంటాను బావా …
కాలతండ్రి : ఏందిరోయ్ అది …
కట్టప్ప : అంటే … ఆ వెన్నుపోటు తర్వాత నేను ఆ శివగామినీ … భల్లాలదేవుణ్నీ, వాడి బాబునీ జాగ్రత్తగా స్కెచ్చేసి లేపేసి రాజునైపోయినా బావుండేది …
కాలతండ్రి : మరి పిల్ల బాహుబలి … దేవసేనల పరిస్తితి ఏమిటంటావ్ ?
కట్టప్ప : వాళ్లనేదో మంచిగా కుంతలకు పంపించేసి ఆ రాజ్యాన్ని మంచి చేసుకుని బుడ్డ బాహుబలిగాణ్ణి అక్కడ రాజును చేసేస్తే సరిపోయేదనుకో … ఏమంటావ్ బావా …
కాల తండ్రి : ఆ అనడానికేముందిరా … మన బతుకులు ఎప్పుడూ వెళ్లిపోయిన నీళ్ల మీద వంతెనలు కట్టుకోవడమే కదరా … ఇట్టైతే బాగుండేది … ఇట్టా చేసుకుంటే బాగుండేది అనుకోవడమేగానీ ఇట్టా చేయండని ఎవుడో చెప్పినప్పుడు నేను చేయను అనే సినిమాయే లేదు కదరా బావా మనకీ …
కట్టప్ప : అంతేలే అంతేలే బావో… జాగ్రత్తగా గడ్డిపీకు … యములాళ్లు వచ్చేస్తున్నారు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here