పవన్‌లో రాజకీయ నాయకుడి లక్షణాలు ఉన్నాయా..?

హనుమంతుడికి తన బలం తనకు తెలియదంటారు. పవన్‌కల్యాణ్‌ పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సినిమాల్లో ఊపు చూసి, తాను వెళ్తే, వస్తున్న జనాలను చూసి మురిసిపోతున్న అపరిమిత జన బల సంపన్నుడికి నిజంగా తన బలం ఏంటో తెలియకుండా ఉందా? ఓ కార్యవర్గం కానీ… నిర్మాణం కానీ… జనసేనకు ఓ రూపురేఖ కానీ లేకుండా పార్టీ ఇలా…. ఒంటికాయ శొంఠిలింగం తరహాలో ఎందుకు అవుతుంది? పార్టీ నిర్మాణం కోణంలో నిర్జనసేనగా ఎందుకు మారుతుందసలు? మెరుపుతీగలా…. ఇలా వచ్చి అలా వెళ్తే… రాజకీయాల్లో రాణింపు సాధ్యమేనా?
 కీలకమైన సమయాల్లో ట్వీట్టితే…. స్పందన ఉంటుందా? అసలు పవన్‌లో రాజకీయ నాయకుడి లక్షణాలు ఉన్నాయా?
 ఇవన్నీ సినిమాల్లో చెప్పుకోవడానికి…. చెబితే వినడానికి బాగానే ఉంటాయ్‌ కానీ… ఫీల్డ్‌లోకి వస్తేనే అసలు పిక్చర్‌ తెలిసేది. సినిమాల్లో పంచ్‌లు వేస్తూ…
దంచే డైలాగులతో అదరగొడితే అది వెండితెరకే పరిమితం అవుతుంది. అసలు సిసలు రాజకీయ నాయకుడు కావాలనున్నప్పుడు చేయాల్సింది ఇది కాదు. ఆన్‌లైన్‌ రాజకీయాలు కంప్యూటర్‌ ముందు కూర్చొని చేస్తే సమ్మగానే అనిపిస్తుంది కానీ… క్షేత్రస్థాయిలో అదే పనిగా ఉంటేనే కానీ తెలియదు చెమట చుక్క విలువ.
  మధ్య మధ్యలో తీరిక చేసుకొని నాలుగు ట్వీట్లు కొట్టిన్నంత మాత్రాన రాజకీయాల్లో కచ్చితంగా రాణించలేరు. నిరంతరం జనాల్లో ఉంటూ… జనాల సమస్యలను తన భుజాలపై మోసే నాయకులనే ప్రజలు చీదరించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటిది ఆన్‌లైన్‌ రాజకీయాలు చేస్తే కొమురం పులిలా గర్జించడం ఇంపాజిబుల్‌ అన్న విషయం ఈ సర్దార్‌కు తెలియట్లేదా?
 ఉద్ధానం మూత్రపిండాల సమస్యనో… పోలవరం నిర్మాణం తీరునో… అక్వా పరిశ్రమపైనో…. ఇలా ట్వీటితే చాలు, అలా పనులు జరిగిపోతున్నాయని పవన్‌ భావిస్తే… అడ్డంగా పప్పులో కాలిసేనట్టే. తానేదో సమస్యను ఎత్తుకోగానే… పాలకులు దిగివచ్చి… సమస్యను పటాపంచలు చేస్తున్నారని అనుకుంటే ఏం లాభం లేదు. ఉండదు కూడా. దానికి అసలు రాజకీయ కోణం వేరేగా ఉంటుంది. ప్రత్యేక హోదాకు సభలు, పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలపై అలుపెరగని పోరాటం చేస్తానన్నాడు పవన్. అదేమైందిప్పుడు? పాచిపోయిన రెండు లడ్డూలంటూ ఎద్దేవ చేసిన ఆ నోటితోనే ప్రత్యేక హోదాపై ఆ మధ్య విజయవాడలో పవన్‌ చేసిన విషయం మనందరికి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here