హైకోర్టులో వేర్వేరుగా రఘురామ కృష్ణంరాజు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు

వైఎస్సార్ సీపీ అధినాయకత్వంపై వ్యవతిరేక స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో రెండు క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. భీమవరం, పోడూరు స్టేషన్లలో తనపై నమోదైన కేసులపై హైకోర్టులో వేర్వేరుగా రఘురామ కృష్ణంరాజు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే ఎంపీ రఘురామ క్వాష్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

ఎంపీ రఘురామపై పోడూరు స్టేషన్‌లో మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడారని గ్రంధి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేశారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు.

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రఘురామ కృష్ణంరాజుకు విజయసాయిరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌హెడ్‌పై షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తమది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్న మాటే వాడకూడదని ఎన్నికల కమిషన్‌ చెప్పిందని.. వేరే పార్టీ ఇచ్చిన షోకాజ్‌కు తానెలా బదులిస్తానని పేర్కొంటూ రఘురామరాజు సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు తనను దూషించడం, దిష్టిబొమ్మలను తగులబెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఓం బిర్లాను, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, కిషన్‌రెడ్డిలను కలిసి అభ్యర్థించారు. ఈ తరుణంలో పార్టీకి తలనొప్పిగా మారిన ఎంపీ రఘురామ కృష్ణరాజును వదిలించుకోవడమే కాకుండా, పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీ పదవిని సైతం దూరం చేయాలని వైసీపీ అధిష్టానం వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here