సుప్రీంకోర్టు మీద సెటైర్లు వేశాడు.. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడా..

భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంపై ఇష్టానురీతిన వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి ఇప్పుడు ఇబ్బందులకు ఎదురు వెళుతున్నాడా అంటే అవున‌నే అనిపిస్తోంది. సుప్రీం కోర్టుకు కాషాయం రంగు వేసి, కోర్టుపై బీజేపీ జెండా ఉన్న ఫొటోను కమెడియన్ కునాల్ కమ్రా షేర్ చేసిన విష‌యం తెలిసిందే.

అంత‌టితో ఆగ‌కుండా తాను సుప్రీం కోర్టుకి క్షమాపణలు చెప్పబోనని, ఎలాంటి జరిమానా చెల్లించబోనని జస్టిస్ కర్ణన్, లాయర్ ప్రశాంత్ భూషణ్ సంఘటనలను గుర్తు చేసే విధంగా వ్యాఖ్యానించారు. కోర్టు తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమన్నట్లు ప్రకటించారు. కునాల్ చేసిన ఈ ట్వీట్‌పై ఇప్పటికే రేగిన దుమారం మరింత తీవ్రమైంది. దీంతో పార్లమెంట్ డేటా పరిరక్షణ జాయింట్ కమిటీ స్పందించింది. సుప్రీం కోర్టుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తూ కోర్టు ధిక్కరణ చర్యల కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్న కమెడియన్ కునాల్ కమ్రాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ట్విట్టర్‌ను నిల‌దీసింది.

దేశ న్యాయవ్యవస్థను కించ పరిచేలా, ఏకంగా భారత న్యాయమూర్తిపైనే అవాక్కులు పేలుతున్న అతడిపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులను ప్రజలు ధైర్యంగా, బహిరంగంగా విమర్శించవచ్చునని, అయితే వాక్‌ స్వాతంత్య్రం అనేది చట్టానికి లోబడి ఉంటుందని అటార్ని జనరల్ కెకె.వేణుగోపాల్‌ కొద్ది రోజుల క్రితం కునాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కునాల్ ట్వీట్లు సుప్రీం కోర్టు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, అతనిపై చర్యలకు అనుమతినివ్వాలని ముగ్గురు లాయర్లు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here