అదో వింత వ్యాధి.. వారిలో ధైర్యాన్ని నింపండి.!

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు కీరవాణి. ఇదిలా ఉంటే తాజాగా ఓ వింత వ్యాధికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో  పంచుకున్నారు. ప్రజల్లో ఆ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో కీరవాణి మాట్లాడుతూ..’ఇటీవలే ఎం.ఎస్‌.(మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌‌) అనే వ్యాధి గురించి తెలిసింది. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. ఇది శరీరానికీ మెదడుకూ మధ్య ఉన్న అనుసంధాన వ్యవస్థను దెబ్బతీస్తుంది. మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేస్తోంది.

అంతేకాదు, ఈ వ్యాధి గురించి ప్రభుత్వానికి తెలిసేలా దీనిపై అవగాహన ఉన్న వారితో కలిసి తన గళాన్ని వినిపిస్తోంది. ఈ సందర్భంగా అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. ఈ సమస్యతో బాధపడే వారికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఎంతో అవసరం. యోగా సాధన, శ్రావ్యమైన సంగీతం ఇలా అన్ని మార్గాల్లోనూ వారిలో మనో ధైర్యాన్ని నింపేలా ప్రోత్సహించండి’ అంటూ ఆ వింత వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు కీరవాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here