అచ్చెన్న అధ్య‌క్ష పదవి ఏమైంది..?

తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు ప్ర‌క‌టిస్తార‌న్న దాంట్లో ఇంత‌వ‌ర‌కూ ఏమీ జ‌ర‌గ‌లేదు. అంతా ఫిక్స‌యింది ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అంటూ వ‌చ్చిన వార్త‌లు ఇప్పుడు రావ‌డం లేదు. దీంతో ఈ నియామ‌కం వెనుక ఏదో జ‌రిగింద‌ని అనుకుంటున్నారు.

ఏపీ టిడిపి అధ్య‌క్షుడిగా అచ్చెన్నాయుడు పేరును ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప‌లు మీడియా చానళ్లు, వార్తా ప‌త్రిక‌ల్లో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏ స్థాయిలో అంటే రేపో మాపో ఇది జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ట్లు వినిపించింది. అయితే దీనికి బ‌లం చేకూరుస్తూ ఓ డేట్‌ని కూడా ఫిక్స్ చేశారు. ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ అధ్య‌క్షుల ప‌ద‌వులు ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారు. అయితే అనూహ్యంగా మిగ‌తావ‌న్నీ ప్ర‌క‌టించినా ఇంత వ‌ర‌కు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్ష నియామ‌కం మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. దీంతో టిడిపిలోనే దీనిపై అసంతృప్తి ఉంద‌ని తెలుస్తోంది.

ఇప్పుడున్న కళా వెంక‌ట్రావును కాద‌ని అచ్చెన్న‌కు ఇవ్వాల్సి వ‌స్తే త‌మ‌కే ఇవ్వాల‌ని పార్టీలోని ప‌లువురు కోరుతున్నార‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో అధ్య‌క్షుడి విష‌యంలో ఏం నిర్ణ‌యం తీసుకోవాలో అధినేత చంద్ర‌బాబుకు అర్థంకావడం లేద‌ని టాక్‌. ఇందుకోస‌మే దీన్ని ఇన్ని రోజులు ఆపాల్సి వ‌చ్చిందంటున్నారు. పైగా మొన్న ప్ర‌క‌టించిన పార్ల‌మెంటు అధ్యక్షుల ప‌ద‌వుల్లో కూడా చాలా మంది త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. ఇవ‌న్నీ ఒకెత్తు అనుకుంటే పార్టీలోని ఒక్కోనేత నెమ్మ‌దిగా త‌మ దారి తాము చూసుకుంటున్నారు. ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం పార్టీకి ఉంది. పైగా కొత్త అసంతృప్తులు రాకుండా బుజ్జ‌గించాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఏ నిర్ణ‌యం తీసుకోలేక టిడిపి అధిష్టానం అచ్చెన్న నియామ‌కాన్ని ఆపాల్సి వ‌చ్చింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here