మోదీ ప్ర‌భుత్వం కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌లో మార్పులు తీసుకొస్తుందా..

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు తీవ్ర అభ్యంత‌రాల‌కు గుర‌వుతున్న విష‌యం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో రైతులు దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని ఢిల్లీలో రైతులు ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. కాగా ఇదివ‌ర‌కే కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లితం లేదు. దీంతో మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. కాగా కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌లో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోందా అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

శనివారం ఉదయం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులు షా, రాజ్‌నాథ్, తోమర్, పీయూశ్ గోయల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే కేంద్ర వ్యవసాయ చట్టాలను సవరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రైతు ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యవసాయ చట్టాలను సవరించాలని ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంటల మద్దతు ధరకు హామీ, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతంతో పాటు కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి సమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పించే అవకాశాలపై కేంద్రం దిగొచ్చే అవకాశముందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ఈ విషయంపై న్యాయ శాఖతో కూడా వ్యవసాయ శాఖ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక ఈ చ‌ట్టాల‌పై రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు దేశ వ్యాప్తంగా కూడా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇటీవ‌ల కెన‌డా దేశం నుంచి కూడా రైతుల‌కు మ‌ద్ద‌తు ల‌భించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌యంలో ఇత‌ర దేశాల జోక్యాన్ని నిర‌సిస్తూ భార‌త్ తీవ్రంగా ఖండించింది కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here